
న్యూస్ డెస్క్: PKL ప్రొ కబడ్డీ లీగ్ మొదటిసారి ప్రారంభమైనప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కానీ కాలక్రమేణా ఆ క్రేజ్ తగ్గింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వ్యూవర్‌షిప్ పడిపోయింది. ఈసారి మాత్రం నిర్వాహకులు ఆటను మరింత ఉత్కంఠభరితంగా మార్చేందుకు కొత్త రూల్స్‌ను తీసుకొచ్చారు.
ఈ సీజన్‌లో సాధారణ పాయింట్ల సిస్టమ్ స్థానంలో గెలిస్తే 2 పాయింట్లు, ఓడితే 0 పాయింట్లు అనే క్లియర్ పద్ధతిని అమలు చేస్తున్నారు. ఇక మ్యాచ్ డ్రా అయితే షూటౌట్ రెయిడ్స్, గోల్డెన్ రెయిడ్‌లతో ఫలితాన్ని ఖాయం చేయనున్నారు. దీంతో ప్రతి మ్యాచ్ చివరి వరకు రసవత్తరంగా సాగుతుందని నిర్వాహకులు నమ్ముతున్నారు.
మొత్తం 12 జట్లు ఈసారి పోటీలో పాల్గొంటున్నాయి. తెలుగు టైటాన్స్ తమ తొలి మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్‌తో తలపడనుంది. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ట్రోఫీ ఆవిష్కరణలు, ఆటగాళ్ల సత్కారాలతో లీగ్‌ను హైప్ చేస్తున్నారు. విశాఖ నుంచి జైపూర్, చెన్నై, ఢిల్లీ వరకూ 108 మ్యాచ్‌లు జరగనున్నాయి.
ప్లే-ఇన్ మ్యాచ్‌లు ఈ సీజన్‌లో కొత్తగా వస్తున్నాయి. 5వ నుంచి 8వ స్థానాల్లో జట్లు ఎలిమినేటర్‌కి చేరే అవకాశం ఉంటుంది. టాప్ 2 జట్లు క్వాలిఫైయర్ 1లో తలపడతాయి. ఓడిన వారికి కూడా మరో అవకాశం ఉండటం ఈ ఫార్మాట్ ప్రత్యేకత.
ఈ కొత్త మార్పులతో ప్రతి పోరులో ఉత్కంఠ పెరుగుతుందని, అభిమానులు మళ్లీ టీవీ ముందు కూర్చునేలా చేస్తుందని నిర్వాహకులు నమ్ముతున్నారు. పీకేఎల్ తన పాత క్రేజ్‌ను తిరిగి తెచ్చుకోవడంలో ఈ రూల్స్ ఎంతవరకు సహాయపడతాయో చూడాలి.
