
న్యూస్ డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు మరింత వేగం పెంచింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై కీలక చర్యలకు సిద్ధమవుతోంది.
ప్రభాకర్ రావును కస్టడీలోకి తీసుకుని విచారించాలన్న లక్ష్యంతో, ఆయన అరెస్ట్‌పై ఉన్న స్టేను రద్దు చేయాలని సిట్ సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. ఇందుకోసం ప్రత్యేక బృందం ఢిల్లీకి వెళ్లింది.
వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, ఏసీపీ వెంకటగిరితో కూడిన బృందం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది. ఇప్పటివరకు ఐదుసార్లు, 40 గంటల పాటు ప్రశ్నించినా ప్రభాకర్ సహకరించడం లేదని అధికారులు అంటున్నారు.
ప్రతి సారి పొంతనలేని సమాధానాలు ఇస్తూ దర్యాప్తును తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పై అధికారుల ఆదేశాలకే తాను పని చేశానంటూ ప్రభాకర్ చెప్పినా, ఆయన ఆదేశాలకే ట్యాపింగ్ చేశామని ఇతర నిందితులు ఒప్పుకున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆగస్టు 5 వరకు ఉన్న స్టేను రద్దు చేయించాలని సిట్ భావిస్తోంది. తద్వారా కస్టడీలో తీసుకుని మరింత లోతుగా విచారించే దిశగా ముందడుగు వేయనుంది.