న్యూస్ డెస్క్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజురోజుకూ మరింత రాజకీయం అవుతోంది. ఈ కేసులో ఈటల రాజేందర్ నేడు సిట్ విచారణకు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన ఫోన్‌ను గతంలో అనేకసార్లు ట్యాప్ చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు.
హుజూరాబాద్, గజ్వేల్ ఎన్నికల సమయంలో తాను ఎవరితో మాట్లాడుతున్నాను, పార్టీ వ్యూహాలు ఏమిటన్న వివరాలన్నీ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే అధికారులకు తెలిసేవని పేర్కొన్నారు. పార్టీ నేతల మధ్య సంభాషణల దాకా కాల్ డేటాలో పొందుపరిచారని అన్నారు.
ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును ఐపీఎస్ కాదని తెలిసినా, చట్ట విరుద్ధంగా పదవిలో ఉంచారని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరమని అభిప్రాయపడ్డారు.
జడ్జీలు, మంత్రులు, నాయకుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని ఈటల ఆరోపించారు. ఇదంతా కేసీఆర్ ఆదేశాల మేరకే జరిగిందని ధ్వజమెత్తారు.
కాళేశ్వరం నివేదికను కూడా బయటపెట్టకపోవడం వెనుక లాలూచీ ఉందని వ్యాఖ్యానించారు. విచారణ నివేదికపై స్పష్టత ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
ఈ వ్యవహారంలో ఎంతటి పెద్దవారైనా శిక్షించాలని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తాము పోరాటం కొనసాగిస్తామని ఈటల స్పష్టం చేశారు.
