
న్యూస్ డెస్క్: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రభాకరరావు బెయిలు రక్షణను రద్దు చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటల లోగా ఆయన దర్యాప్తు అధికారి ముందు లొంగిపోవాలని ధర్మాసనం ఆదేశించింది.
జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం ప్రభాకరరావును సిట్ కస్టడీకి అప్పగించడానికి అనుమతి ఇచ్చింది. అయితే విచారణ సమయంలో ఆయనకు ఎలాంటి భౌతిక ఇబ్బందులు కలిగించకూడదని పోలీసులకు సూచించింది. కస్టడీలో ఇంటి భోజనం ఇవ్వాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.
గత ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ప్రభాకరరావు ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవగానే అమెరికా వెళ్లిపోయారు. తిరిగి రాష్ట్రానికి రావాలంటే ముందస్తు బెయిలు ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది.
ప్రభాకరరావు ఈ కేసులో కీలమైన ఆధారాలను ధ్వంసం చేశారని ప్రభుత్వం తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. డిజిటల్ ఎక్విప్మెంట్ పాస్ వర్డ్స్ ఇవ్వకుండా, విచారణకు ఏ మాత్రం సహకరించడం లేదని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.
ముఖ్యంగా ఐక్లౌడ్ పాస్ వర్డులను రీసెట్ చేయాలని గతంలో న్యాయస్థానం ఆదేశించినా ప్రభాకరరావు పాటించలేదని ప్రభుత్వం ఆరోపించింది. విచారణకు సహకరించకపోవడంతోనే బెయిల్ రద్దు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని స్పష్టం చేసింది.
సుప్రీం ఆదేశాలతో ఇప్పుడు 14 రోజుల పాటు ప్రభాకరరావు సిట్ కస్టడీలో విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
