న్యూస్ డెస్క్: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మరోసారి పెద్ద వివాదంలో చిక్కుకుంది. 2023-24 సంవత్సరానికి సంబంధించిన ఆడిట్‌లో భారీ అవినీతికి సంబంధించిన విషయాలు వెలుగు చూశాయి.
ఆడిటర్ జనరల్ నివేదిక ప్రకారం, మొత్తం రూ.600 కోట్ల మేర ఆర్థిక అవకతవకలు జరిగినట్లు వెల్లడించారు. ముఖ్యంగా టికెటింగ్, బ్రాడ్‌కాస్టింగ్, స్పాన్సర్‌షిప్ ఒప్పందాల్లో పారదర్శకత లేకపోవడం స్పష్టమైంది.
రూపాయల 500 కోట్ల స్పాన్సర్ డబ్బులు రికవరీ కాకపోవడం, రూ.43.9 కోట్ల మీడియా హక్కులు తక్కువ ధరకు ఇచ్చినట్లు నమోదైంది. అంతేకాదు, భద్రతా భోజన ఖర్చుల పేరుతో రూ.6.3 కోట్లు వినియోగించారు.
మ్యాచ్ అధికారులకు అధిక చెల్లింపులు, మీడియా డైరెక్టర్‌కు రూ.9 లక్షల జీతం వంటి అక్రమ నియామకాలు రిపోర్ట్‌లో ఉన్నాయి.
పీసీబీ చైర్మన్‌కు యుటిలిటీ ఖర్చుల పేరుతో రూ.41 లక్షలు చెల్లించారని, ఇది చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. ఈ వ్యవహారం హోం మంత్రిగా ఉన్నప్పుడు జరగడం గమనార్హం.
ఈ ఘటన పీసీబీలో పరిపాలన సమస్యలు, రాజకీయ జోక్యాన్ని మరోసారి ఎత్తిచూపింది. తాజా కుంభకోణంతో పాక్ క్రికెట్ మరో సంక్షోభంలోకి జారిపోయింది.