
న్యూస్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల వల్ల క్లస్టర్ వ్యవస్థ పూర్తిగా రద్దయింది. గతంలో ఉన్న 7,244 క్లస్టర్ల స్థానంలో, ఇక మీదట 13,351 గ్రామ పంచాయతీలను స్వతంత్ర పరిపాలనా యూనిట్లుగా పరిగణించనున్నారు. ఈ నిర్ణయంతో మొత్తం పంచాయతీ పాలనా వ్యవస్థపై పవన్ కల్యాణ్ ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ సంస్కరణల్లో భాగంగా, పంచాయతీ కార్యదర్శి పేరును పంచాయతీ అభివృద్ధి అధికారి (పి.డి.ఓ.)గా మార్చారు. పరిపాలనా సౌలభ్యం కోసం మొత్తం పంచాయతీలను నాలుగు గ్రేడ్లుగా వర్గీకరించారు. గ్రేడ్ 1 పంచాయతీల్లో పని చేస్తున్న 359 మంది కార్యదర్శులకు వేతన శ్రేణి పెంపుతో పాటు, డిప్యూటీ ఎంపీడీఓ కేడర్ కల్పించనున్నారు. వీరిని 359 రూర్బన్ పంచాయతీల్లో నియమిస్తారు.
10 వేల జనాభా దాటిన పంచాయతీలను ఇకపై రూర్బన్ పంచాయతీలుగా గుర్తించి, వాటిలో పట్టణ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పిస్తారు. కొత్త విధానంలో గ్రామ పంచాయతీల్లో పనిచేసే సిబ్బంది కూర్పులోనూ మార్పులు చేశారు. మున్సిపాలిటీల్లో మాదిరిగా ప్లానింగ్, పారుశుధ్యం, మంచినీటి సరఫరా వంటి విభాగాలు ఏర్పాటు చేస్తారు.
అలాగే, మినిస్టీరియల్, క్షేత్ర స్థాయి పోస్టుల మధ్య పరస్పర ప్రమోషన్లకు అవకాశం కల్పించారు. దీనికి సంబంధించిన సర్వీస్ రూల్స్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అంతేకాకుండా, పంచాయతీ రాజ్ శాఖలో ప్రత్యేకంగా ఐటీ విభాగాన్ని ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.
గ్రామ పంచాయతీల్లో పారదర్శక పాలన అందించడానికి ఈ కొత్త విధానాలకు రూపకల్పన చేశారు. ఈ సంస్కరణలు మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం ఆలోచనల ప్రకారం రూపొందించినట్లు చెబుతున్నారు. కలాం స్ఫూర్తితోనే, పల్లెల్లో మౌలిక వసతులు మెరుగుపరచడానికి, పౌర సేవలు సక్రమంగా అందేలా పాలన వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలని పవన్ నిర్ణయించారు.
పంచాయతీ వ్యవస్థపై సుదీర్ఘ అధ్యయనం, నిపుణులతో నాలుగు నెలలపాటు పలు దఫాలు చర్చించిన తర్వాతే పవన్ ఈ కీలక సవరణలను ప్రతిపాదించారు. గ్రామాల అభివృద్ధి కోసం ‘పల్లె పండుగ’ పేరుతో వేలాది కిలోమీటర్ల గ్రామీణ రహదారుల నిర్మాణానికి కూడా ఆయన నడుంకట్టారు.
