
న్యూస్ డెస్క్: ఒక్క ఓటు విలువ ఎంత అనే ప్రశ్నకు తెలంగాణలోని నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం బాగాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితం ఒక స్పష్టమైన సమాధానం ఇచ్చింది. అక్కడ సర్పంచ్ గెలుపు ఓటమి మధ్య తేడా కేవలం ఒక్క ఓటు మాత్రమే.
అమెరికా నుంచి వచ్చి ఓటు వేసిన మామ:
ఈ ఎన్నికల్లో సర్పంచ్‌గా గెలిచిన ముత్యాల శ్రీదేవ భవితవ్యాన్ని మార్చింది ఎవరో కాదు. అమెరికాలో నివసిస్తున్న ఆమె మామ, ఎన్నారై ఓటరు ముత్యాల ఇంద్రకరణ్ రెడ్డి. అమెరికాలో సౌకర్యవంతమైన జీవితాన్ని, అన్ని బాధ్యతలను పక్కనపెట్టి, కేవలం తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి వేల కిలోమీటర్లు ప్రయాణించి ఆయన నిర్మల్‌కు రావడం ఈ ఎన్నికల్లో కీలకంగా మారింది.
గ్రామ పంచాయతీలో 426 ఓటర్లకు గాను 378 ఓట్లు పోలయ్యాయి. ఫలితాల్లో శ్రీదేవకు 189 ఓట్లు రాగా, ఆమె ప్రత్యర్థి హరస్వతికి 188 ఓట్లు వచ్చాయి. ఒక ఓటు చెల్లుబాటు కాకపోవడంతో, విజయం ఓటమి మధ్య కేవలం ఒక్క ఓటు తేడా నిలిచింది. ఆ కీలకమైన ఓటు ఇంద్రకరణ్ రెడ్డిదే. ఆయన రాకపోయి ఉంటే ఫలితం పూర్తిగా భిన్నంగా ఉండేది.
ప్రజాస్వామ్యానికి గుణపాఠం:
ఈ ఘటన ప్రజాస్వామ్యానికి సంబంధించిన ఒక బలమైన సామాజిక సందేశం. ముఖ్యంగా ‘పని ఉంది’, ‘ట్రాఫిక్ ఉంది’ అంటూ ఓటింగ్‌ను నిర్లక్ష్యం చేసే వారికి ఇది ఒక గుణపాఠం కావాలి. ఒక చిన్న పంచాయతీ ఎన్నికల్లో ఒక్క ఓటు నిర్ణయాత్మకం కాగలిగితే, పెద్ద ఎన్నికల్లో ప్రతి ఓటు ప్రభావం ఎంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
విదేశాల్లో ఉంటూ కూడా తన గ్రామం స్థానిక ప్రజాస్వామ్యం పట్ల బాధ్యత చూపించిన ఎన్నారై ఇంద్రకరణ్ రెడ్డి చర్య, ఓటు అనేది వ్యక్తిగత బాధ్యత అని చాటి చెప్పింది. ‘నా ఓటుతో ఏమవుతుంది?’ అనే ప్రశ్నకు బాగాపూర్ ఇచ్చిన సమాధానం.. ప్రతి ఓటుతో మార్పు వస్తుంది అనే స్పష్టతను ఇస్తుంది.
