
న్యూస్ డెస్క్: హిమాలయ దేశమైన నేపాల్‌కు రాజకీయ ప్రయాణం చాలా విభిన్నంగా సాగింది. ఒకప్పుడు రాజరికం ఉన్న ఈ దేశంలో మావోయిస్టుల పోరాటం కారణంగా రాజరికం రద్దై, ప్రజాస్వామ్యం స్థాపించబడింది. ఈ ప్రయాణం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.
2006 వరకు నేపాల్‌లో రాజరికమే కొనసాగింది. రాజు జ్ఞానేంద్ర పాలనలో మావోయిస్టుల ఉద్యమం గట్టి పుంజుకుంది. చివరకు 2008 మే 28న నేపాల్‌ను ఫెడరల్ డెమోక్రటిక్ రిపబ్లిక్గా ప్రకటించి రాజరికానికి ముగింపు పలికారు. కానీ ప్రజాస్వామ్య స్థాపన తర్వాత కూడా అక్కడ ప్రభుత్వాలు తరచూ మారిపోతున్నాయి. ఇది రాజకీయ అస్థిరతకు దారితీస్తోంది.
నేపాల్ ప్రపంచంలో ఏకైక హిందూ దేశంగా ప్రసిద్ధి చెందింది. భారత్‌తో దీని సంబంధాలు చారిత్రకంగా బలంగా ఉన్నాయి. 1950లలోనే భారతదేశంతో విలీనం ప్రతిపాదన వచ్చినా, అప్పటి ప్రధాని నెహ్రూ తిరస్కరించారు. అయినప్పటికీ రెండు దేశాల మధ్య సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక బంధం కొనసాగుతోంది. పాస్‌పోర్ట్ అవసరం లేకుండా భారతీయులు, నేపాలీలు సరిహద్దులు దాటే స్వేచ్ఛ కలిగి ఉన్నారు.
చరిత్రలో ఒక సంఘటన ప్రత్యేకం. 2001లో రాజు బీరేంద్ర, ఆయన భార్యను వారి కుమారుడు దీపేంద్ర హత్య చేయడం నేపాల్‌ను కుదిపేసింది. ఆ తరువాత జ్ఞానేంద్ర రాజుగా బాధ్యతలు చేపట్టినా, మావోయిస్టుల ఒత్తిడి కారణంగా ఆయన కూడా పదవి వదిలారు.
నేపాల్ నుంచి బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ మనీషా కొయిరాలా రావడం కూడా విశేషమే. ఆమె తాత బీపీ కొయిరాలా ఆ దేశ ప్రధానిగా పనిచేశారు. మొత్తంగా, రాజరికం నుంచి మావోయిజం, అక్కడి నుంచి ప్రజాస్వామ్యం దాకా వచ్చిన నేపాల్, ఇప్పటికీ స్థిరత్వం కోసం కృషి చేస్తూనే ఉంది.
