
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ త్వరలో చైనాను సందర్శించనున్నారని సమాచారం. చైనాలోని తియాంజిన్ నగరంలో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు జరిగే ఎస్‌సీవో సమ్మిట్‌లో పాల్గొనేందుకు మోదీ వెళ్లనున్నారు.
ఈ సమావేశానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కూడా హాజరుకానున్నారు. సదస్సు సందర్భంగా మోదీ, జిన్ పింగ్ మధ్య ప్రత్యేక సమావేశం జరిగే అవకాశముందని అధికారులు పేర్కొంటున్నారు.
గల్వాన్ లోయలో 2020లో జరిగిన ఘర్షణ తర్వాత మోదీ తొలిసారిగా చైనాలో అడుగుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యత పెరిగింది.
ఇప్పటి వరకు ప్రధాని హోదాలో మోదీ ఐదుసార్లు చైనాలో పర్యటించారు. కానీ 2020 ఘటన తర్వాత ఈ పర్యటన మొదటిదే కావడం గమనార్హం.
ఇటీవల విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా చైనా పర్యటనకు వెళ్లారు. చైనా అధ్యక్షుడితో భేటీ అయ్యారు. దీంతో ద్వైపాక్షిక చర్చలకు ఇది ముంగిటపట్టి కావచ్చని భావిస్తున్నారు.
ద్వైపాక్షిక సంబంధాలు, సరిహద్దు సమస్యల పరిష్కారం వంటి అంశాలపై మోదీ-జిన్ పింగ్ భేటీలో చర్చలు జరగనున్నాయని సమాచారం.