
న్యూస్ డెస్క్: బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతలైన సోదర-సోదరి కేటీఆర్, కవితల మధ్య విభేదాలు బహిరంగంగా కనిపిస్తున్నాయి. ఇటీవల కేటీఆర్ తీసుకున్న కీలక నిర్ణయంతో ఈ చర్చ మరింత వేడెక్కింది. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గౌరవాధ్యక్షురాలిగా ఉన్న కవితకు పక్కన పెట్టి, ఇన్ఛార్జిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను నియమించడం రాజకీయ సందేశాలు పంపుతోంది.
ఈ నిర్ణయంతో పార్టీ వ్యవస్థలో కవిత పాత్ర క్రమంగా తగ్గించబడుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆమె బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు రాసిన లేఖ లీక్ కావడం, అందులో కేటీఆర్ పై పరోక్ష విమర్శలు చేయడం ఈ తగాదాకు బలాన్ని చేకూర్చింది.
అలాగే పార్టీ కార్యక్రమాల కంటే తన స్వంత జాగృతి సంస్థను పటిష్టం చేయడంలో కవిత నిమగ్నమవ్వడం కూడా ఆమె ప్రాధాన్యత తగ్గుతున్నదనే సంకేతాలిచ్చింది. పార్టీ వర్గాల్లో ఆమెకు మద్దతు తగ్గుతోందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇదిలా ఉంటే, కొప్పుల ఈశ్వర్‌ను రంగంలోకి దించడంలో కేటీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కవితను బలహీనపరిచే ప్రయత్నమేనా? లేక పార్టీకి కొత్త దిశ చూపించడమేనా అన్నదానిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.
కూటమి ప్రభుత్వ అవతరణతో విపక్ష బలంగా మారాల్సిన సమయంలో బీఆర్ఎస్ లో అంతర్గత విభేదాలు కొత్త మలుపులు త్రళుతున్నాయి. నేతల మధ్య సమన్వయం లేకపోతే పార్టీ భవితవ్యం ఎటు వెళ్లనుందన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న.