
న్యూస్ డెస్క్: అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక నివేదికను ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేటింగ్ బ్యూరో (AAIB) విడుదల చేసింది. ఈ నివేదికలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
విమాన టేకాఫ్ అయిన కొద్ది సెకన్లలోనే ఇంజిన్ కంట్రోల్ స్విచ్లు ఆగిపోయాయని పేర్కొన్నారు. దీనిపై పైలట్ల మధ్య సంభాషణలో, ఓ పైలట్ “వాటిని ఎందుకు ఆఫ్ చేశావు?” అని ప్రశ్నించగా, “నేను ఆఫ్ చేయలేదు” అని సమాధానమిచ్చినట్టు నమోదైంది.
అయితే వెంటనే మేడే కాల్ ఇచ్చినట్టు గుర్తించబడింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ స్పందించినా, ఆపై పైలట్ల నుంచి ఎలాంటి స్పందన రాలేదని అధికారులు తెలిపారు. అంతలోనే విమానం కూలిపోయినట్టు నివేదిక పేర్కొంది.
ప్రమాదానికి ముందు బరువు, ఇంధనం పరిమితుల లోపలే ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు. ప్రమాదకర వస్తువులు ఏవీ లేవని పేర్కొన్నారు.
ఇంజిన్లను ఇప్పటికే వెలికి తీసినట్టు అధికారులు వెల్లడించారు. ఇప్పుడు మరింత లోతుగా దర్యాప్తు జరిపి పూర్తి నివేదిక త్వరలో విడుదల చేయనున్నారు.
