
న్యూస్ డెస్క్: కర్ణాటకలో సీఎం మారుతారన్న ప్రచారానికి తాజాగా మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలు మరింత ఊతమిచ్చాయి. ముఖ్యమంత్రి మార్పు అంశంపై స్పష్టత ఇవ్వకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఖర్గే మాట్లాడుతూ, ఈ విషయంలో తుది నిర్ణయం పార్టీ అధిష్టానానిదే అన్నారు. సిద్ధరామయ్య స్థానంలో డీకే శివకుమార్ బాధ్యతలు చేపడతారన్న ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి.
కాంగ్రెస్ నాయకుడు రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా బెంగళూరు పర్యటన కూడా ఈ ప్రచారానికి బలం ఇచ్చింది. ఖర్గే మాత్రం ఈ అంశాన్ని అధిష్ఠానం పరిధిలోనిదిగా చెబుతూ, ఎవరూ సమస్యలు సృష్టించవద్దని సూచించారు.
ఇక శివకుమార్ వర్గం నేతలు మార్పు తథ్యమేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ మాట్లాడుతూ, త్వరలో శివకుమార్ సీఎంగా మారే అవకాశం ఉందన్నారు. ఆయన పార్టీ కోసం చేసిన కృషికి గుర్తింపు రావాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు.
ఇక సహకార శాఖ మంత్రి కేఎన్ రాజన్న కూడా సెప్టెంబర్ తర్వాత మార్పులు ఉంటాయని సూచన ఇచ్చారు. అధిష్ఠానం తీసుకునే నిర్ణయం ప్రకారం కర్ణాటక రాజకీయాల దిశ మారనుందని విశ్లేషణలు కొనసాగుతున్నాయి.
2023లో సీఎం పదవి కోసం సిద్ధరామయ్య-శివకుమార్ మధ్య పోటీ జరిగింది. అప్పట్లో రెండున్నరేళ్ల తర్వాత సీఎం పదవి రొటేషన్ జరుగుతుందన్న ఒప్పందం జరిగినట్టు వార్తలొచ్చాయి. ప్రస్తుతం అదే అంశం మళ్లీ చర్చలోకి వచ్చింది.
ఖర్గే తాజా వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ పెరిగింది. అధిష్ఠానం తీసుకునే నిర్ణయమే ఇక రాజకీయ దిశను నిర్ణయించనుంది.
