
న్యూస్ డెస్క్: బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాత కవిత రాజకీయ వ్యూహాల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్త పార్టీ పెట్టే దిశగా ఆమె సహచరులతో సమాలోచనలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే, ప్రస్తుతం జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు స్థానిక ఎన్నికలకు మద్దతు ఇవ్వకుండా దూరంగా ఉండాలని ఆమె నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ నిర్మాణం ఇంకా పూర్తి కాకపోవడం వల్లే ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని రాజకీయ ఉద్దండులు ఆమెకు సలహా ఇచ్చారు.
ఇదే సమయంలో, కవిత తన ఉనికిని చాటుకోవడానికి సెంటిమెంట్‌ను వాడుతున్నట్లు కనిపిస్తోంది. ఒక జర్నలిస్టుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, తనను కుటుంబానికి దూరమవడం తేలికైన విషయం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడిన తీరు మహిళా సెంటిమెంటును టచ్ చేసే ఉద్దేశంగా చెబుతున్నారు.
తాను పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు ఎప్పుడూ చేయలేదని కవిత స్పష్టం చేశారు. అయితే, తన సస్పెన్షన్ వెనుక కేసీఆర్ ‘ఉద్దేశం’ ఏంటో తనకు తెలిసిందని ఆమె వెల్లడించడం ప్రాధాన్యం సంతరించుకుంది. తన సస్పెన్షన్ ఉత్తర్వులపై కేసీఆర్ సంతకం లేకపోయినా, ఈ నిర్ణయం ఆయనదేనని ఆమె చెప్పడం గమనార్హం.
కొంతమంది కారణంగానే ఇది జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బిడ్డపై మమకారంతో కేసీఆర్ సస్పెన్షన్‌కు అడ్డు చెప్పి ఉంటారని ఇన్నాళ్లు ఒక వాదన వినిపించింది. కానీ, తనను బీఆర్ఎస్ నుంచి బలవంతంగా వెళ్లగొట్టేందుకు ప్రయత్నించారని చెప్పడానికే కవిత ఇలా మాట్లాడుతున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కుటుంబానికి దూరంగా ఉండటం తేలికైన విషయం కాదంటూ కవిత చెప్పడం వెనుక, ఆమెను బీఆర్ఎస్ నుంచి సాగనంపడంపై కేసీఆర్ రెండో ఆలోచన చేయలేదని చెబుతున్నారు. మొత్తానికి, బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ అనంతరం కవిత వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ, తగిన సమయం కోసం ఎదురుచూస్తున్నారని అంటున్నారు.
