
తెలంగాణ: రాజకీయాల్లో మాజీ ఎమ్మెల్సీ కవిత భవిష్యత్ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. బిఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాత ఆమె కాంగ్రెస్‌లో చేరతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్ష పదవి కవితకు ఇస్తారని ప్రచారం సాగుతుండటం ఆసక్తి రేపుతోంది.
కవిత వ్యవహారశైలి, కాంగ్రెస్‌తో ఉన్న సాన్నిహిత్యం ఈ చర్చలకు కారణంగా మారాయి. ఇటీవల ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు పొందిన సుదర్శన్ రెడ్డికి కవిత సపోర్ట్ చేయడం కూడా ఈ ఊహాగానాలకు బలం చేకూర్చింది. బీజేపీకి వ్యతిరేకంగా ఆమె తీసుకుంటున్న వైఖరి కాంగ్రెస్ వైపు దారి తీస్తోందని పలువురు అంటున్నారు.
అయితే టీపీసీసీ అధ్యక్ష పదవి కవితకు ఇవ్వడం అంత సులభం కాదు. ప్రస్తుత చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా కీలక పాత్ర పోషిస్తున్నారు. కవితను ఆ స్థాయికి తీసుకురావడం అంటే అంతర్గత విభేదాలకు దారితీయొచ్చు.
ఆంధ్రప్రదేశ్‌లో షర్మిళకు కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చిన ఉదాహరణను కొందరు ప్రస్తావిస్తున్నా, కవిత పరిస్థితి పూర్తిగా భిన్నం. తెలంగాణలో ఇప్పటికే బలమైన స్థానిక నేతలు ఉన్నారు. పైగా కవిత-రాహుల్ గాంధీ మధ్య అనుబంధం అంతగా బలంగా లేదని అంటున్నారు.
మొత్తం మీద కవిత కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు ఉన్నప్పటికీ, టీపీసీసీ చీఫ్ పదవి ఆమెకు దక్కే పరిస్థితి మాత్రం క్లిష్టంగా కనిపిస్తోంది. ఈ చర్చలు మాత్రం ఆమె రాజకీయ ప్రాధాన్యతను మళ్లీ వెలుగులోకి తెచ్చాయి.
