
2022లో వచ్చిన ‘కాంతార’ సినిమా సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రం, కర్ణాటక భూత కోల సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసింది. రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, జాతీయ అవార్డుల వరుసను గెలుచుకుంది.
ఈ విజయంతో ‘కాంతార: చాప్టర్ 1’ పేరుతో ప్రీక్వెల్ రూపొందుతోంది. అక్టోబర్ 2న విడుదలకు సిద్ధమైన ఈ చిత్రంలో నాగ సాధువు పాత్రలో రిషబ్ శెట్టి కనిపించనున్నాడు. ఇప్పటికే 500 ఫైటర్లతో యుద్ధ సన్నివేశాలు తెరకెక్కించారు. జయరామ్, కిషోర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం, ‘కాంతార’ ఫ్రాంచైజ్‌లో మూడో చిత్రం కూడా రాబోతోంది. ‘చాప్టర్ 1’ విడుదల సందర్భంగా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ సినిమా కూడా కర్ణాటక ఆధ్యాత్మికత, సంస్కృతిని ఆధారంగా చేసుకుని సాగనుందని సమాచారం.
హోంబలే ఫిల్మ్స్ ఈ ప్రాజెక్ట్‌ను సినిమాటిక్ యూనివర్స్‌గా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఉంది. ఇప్పటికే ‘KGF’తో ఆ స్థాయి స్థాపించిన ఈ సంస్థ, ‘కాంతార’తో కూడా అదే స్థాయిని అందుకోవాలనుకుంటోంది.
‘కాంతార: చాప్టర్ 1’ కన్నడతో పాటు, తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల కానుంది.