Friday, January 9, 2026
HomeTelanganaకాళేశ్వరం నివేదికపై స్టేకు హైకోర్టు నిరాకరణ

కాళేశ్వరం నివేదికపై స్టేకు హైకోర్టు నిరాకరణ

kaleshwaram-report-stay-rejected-by-high-court

న్యూస్ డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికను నిలిపివేయమని మాజీ ఐఏఎస్ అధికారి ఎస్కే జోషి హైకోర్టును ఆశ్రయించారు. అయితే, ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు తక్షణ స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం ఈ పిటిషన్‌పై వాదనలు విన్నది. ఈ సందర్భంగా “మీకు కమిషన్ నివేదిక ఎలా చేరింది?” అని జోషిని ప్రశ్నించింది. నివేదికపై స్టే నిరాకరిస్తూ, పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని జోషికి ఆదేశించింది.

జోషి తన పిటిషన్‌లో, కమిషన్ తనను కేవలం సాక్షిగా విచారణకు పిలిచిందని, కానీ తుది నివేదికలో తనపై ఆరోపణలు చేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఆరోపణలు చేసే ముందు తనకు నోటీసు ఇవ్వలేదని, క్రాస్ ఎగ్జామినేషన్ అవకాశం కూడా కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అలాగే, ప్రభుత్వం ఈ నివేదిక ఆధారంగా తనపై చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. కమిషన్ జులై 31న సమర్పించిన నివేదికను ప్రభుత్వం మీడియా సమావేశంలో బయటపెట్టడం తన ప్రతిష్టకు భంగం కలిగించిందని తెలిపారు.

తదుపరి విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేసిన ధర్మాసనం, అప్పటివరకు ఇరుపక్షాలు తమ వాదనలకు సంబంధించిన పత్రాలు సమర్పించాలని సూచించింది. ఈ కేసు తదుపరి విచారణపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular