న్యూస్ డెస్క్: దేశంలో జమిలి ఎన్నికల (ఒకేసారి అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలు) వ్యవహారం కొన్నాళ్లుగా చర్చలో ఉంది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సారథ్యంలో వేసిన కమిటీ దీనిపై అధ్యయనం చేసి నివేదికను కేంద్రానికి ఇచ్చింది.
మొదట్లో రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని కేంద్రం చెప్పింది. అయితే తాజాగా పార్లమెంటులో త్రిపుర సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి బదులిస్తూ.. కోవింద్ నివేదికలో రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోవాల్సిన అవసరం లేదని ఉన్నా, దీనిపై పరిశీలన చేస్తున్నామని అన్నారు.
కేంద్రం పైకి చెబుతున్నా, రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకునే ఉద్దేశం లేదన్న చర్చ నడుస్తోంది. “ఇది జాతి ప్రయోజనంతో కూడిన వ్యవహారం. దీనిపై కేంద్రం తీసుకునే నిర్ణయమే ఫైనల్” అని కొందరు బీజేపీ ఎంపీలు పార్లమెంటు లాబీల్లో వ్యాఖ్యానించినట్లు సమాచారం.
2029 తర్వాతే జమిలి ఉంటుందని కేంద్రం ప్రకటించింది. అయితే 2026లో యూపీ, బెంగాల్, తమిళనాడు, కేరళ, త్రిపుర సహా పలు రాష్ట్రాలు ఎన్నికలకు రెడీ అవుతున్నాయి.
ఒకవేళ 2029లోనే జమిలి అమలైతే, ఈ రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలకు మరో రెండేళ్ల సమయం మాత్రమే ఉంటుంది. దీనికి ఆయా రాష్ట్రాలు ఒప్పుకొంటాయా అనేది కీలకం. ఇప్పటికే బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు తమ అభిప్రాయాలు తీసుకోకుండా జమిలికి ఎలా వెళ్తారని ప్రశ్నిస్తున్నాయి.
జమిలి విషయంలో రాష్ట్రాల అధికారాలను అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోక పోతే, మరో రాజకీయ దుమారం ఖాయం. మొత్తంగా కేంద్రం కోవింద్ కమిటీని అడ్డుపెట్టి రాష్ట్రాల అధికారాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తోందన్న వాదన బలపడుతోంది.
