
న్యూస్ డెస్క్: ఐపీఎల్ మ్యాచ్‌లను స్టేడియంలో చూడటం ఇకపై అభిమానుల జేబుకు గట్టి భారంగా మారనుంది. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధానంలో చేసిన తాజా మార్పుల వల్ల టికెట్ ధరలు పెరగనున్నాయి.
56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటి వరకు ఉన్న 5, 12, 18, 28 శాతం పన్ను శ్లాబుల స్థానంలో 5, 18 శాతం మాత్రమే కొనసాగనుండగా, విలాస వస్తువులు, ఆన్‌లైన్ గేమింగ్, క్యాసినో, గుర్రపు పందేలతో పాటు ఐపీఎల్ వంటి ప్రీమియం క్రీడా ఈవెంట్లపై కొత్తగా 40 శాతం ప్రత్యేక పన్ను శ్లాబ్ అమలు చేయనున్నారు.
ఇప్పటి వరకు ఐపీఎల్ టికెట్లపై 28 శాతం పన్ను ఉండగా, ఇప్పుడు అది 40 శాతానికి పెరిగింది. ఉదాహరణకు రూ. 1000 విలువైన టికెట్‌పై ముందుగా రూ. 1280 చెల్లించాల్సి వచ్చేది. కొత్త విధానంలో అది రూ. 1400కి పెరుగుతుంది. అంటే ఒక్క టికెట్‌కే అదనంగా రూ. 120 భారం.
అయితే, జాతీయ, అంతర్జాతీయ సమాఖ్యలు గుర్తించిన క్రీడా ఈవెంట్లకు ఈ పన్ను వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. టీమిండియా మ్యాచ్‌లు, అంతర్జాతీయ టోర్నీలు ఈ జాబితాలో లేవు.
రూ. 500లోపు టికెట్లు పూర్తిగా మినహాయింపుతో ఉంటాయి. కానీ రూ. 500కు మించిన టికెట్లపై 18 శాతం పాత పన్ను విధానం కొనసాగుతుంది. దీంతో జాతీయ మ్యాచ్‌లు చూడటానికి వెళ్లే అభిమానులకు ఊరట దొరికినప్పటికీ, ఐపీఎల్ వీక్షకులపై మాత్రం అదనపు భారం తప్పదని స్పష్టమైంది.
