
న్యూస్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్‌కు సంబంధించిన మినీ వేలం ముహూర్తం దగ్గర పడింది. మంగళవారం అబుదాబిలో ఈ ఆటగాళ్ల వేలం జరగనుంది. మొత్తం 1,355 మంది రిజిస్టర్ చేసుకోగా, షార్ట్ లిస్ట్ అనంతరం 350 మంది ఆటగాళ్లు వేలంలోకి రానున్నారు. ఫ్రాంచైజీలు కేవలం 77 మందిని మాత్రమే కొనేందుకు అవకాశం ఉంది.
ఈసారి మినీ వేలానికి భారత్ నుంచి పెద్ద స్టార్ క్రికెటర్లు ఎవరూ లేరు. అయితే, నిరుడు మెగా వేలంలో రూ.23.75 కోట్ల రికార్డు ధర పలికిన వెంకటేశ్ అయ్యర్ పై అందరి ఫోకస్ ఉంది. కనీస ప్రదర్శన చేయకపోవడంతో కోల్‌కతా నైట్ రైడర్స్ అతడిని వేలానికి వదిలేసింది. స్పిన్నర్ రవి బిష్ణోయ్ కూడా రూ.2 కోట్ల ప్రాథమిక ధరతో వేలంలో ఉన్నాడు.
మంగళవారం నాటి ఆక్షన్ లో విదేశీ ఆటగాళ్లకు భారీ ధర దక్కే ఛాన్స్ ఉంది. రూ.కోటితో వేలానికి వచ్చిన విధ్వంసక ప్లేయర్ క్వింటాన్ డికాక్, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ వంటి వారికి డిమాండ్ ఉంది. ఈసారి విదేశీయుల్లో అతడే టాప్ పెయిడ్ ప్లేయర్ అవుతాడని అంచనా.
అయితే, ఈసారి విదేశీయుల అత్యధిక ప్రైస్‌ను రూ.18 కోట్లుగా ఐపీఎల్ పాలక మండలి నిర్ణయించింది. కొందరు విదేశీ ఆటగాళ్లు మెగా వేలం ఎగ్గొట్టి మినీ వేలంలోకి నేరుగా వస్తుండటంతో, ఆటగాళ్ల అతి తెలివికి కళ్లెం వేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. విదేశీ ఆటగాడు ఒకవేళ మినీ వేలంలో రూ.18 కోట్ల కంటే ఎక్కువ మొత్తం పొందినా అతడికి దక్కేది రూ.18 కోట్లే. మిగిలిన మొత్తాన్ని బీసీసీఐ ఆటగాళ్ల సంక్షేమానికి ఉపయోగిస్తుంది.
