
న్యూస్ డెస్క్: దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో వరుసగా విమానాలు రద్దు చేయడంతో వింత సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా కర్ణాటకలోని హుబ్బళ్లిలో పెళ్లి రిసెప్షన్ విషయంలో ఎవరు ఊహించని విడ్డూరం జరిగింది.
హుబ్బళ్లికి చెందిన మేధా ఒడిశాలోని సంగమ దాస్‌ల రిసెప్షన్ బుధవారం జరగాల్సి ఉంది. అయితే పైలట్ కొరత కారణంగా ఇండిగో విమానాలు ఆలస్యమై చివరికి రద్దు కావడంతో, వధూవరులు సమయానికి హుబ్బళ్లి రాలేకపోయారు.
అప్పటికే అతిథులు రావడం ఏర్పాట్లు పూర్తి చేసుకోవడంతో రిసెప్షన్ ఈవెంట్ రద్దు చేయడం మంచిది కాదని కుటుంబ సభ్యులు భావించారు. వధువు తల్లి ఈ విషయంపై ఆవేదన వ్యక్తం చేశారు.
కుటుంబమంతా చర్చించుకున్న తర్వాత ఆన్‌లైన్ రిసెప్షన్ నిర్వహించాలని నిర్ణయించారు. వధూవరులు ఇద్దరు సాంప్రదాయ దుస్తులు ధరించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ రిసెప్షన్‌లో పాల్గొన్నారు. హుబ్బళ్లిలో పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేసి అతిథులకు వారిని చూపించారు.
ఇండిగో దాదాపు 500 కంటే ఎక్కువ విమానాలను రద్దు చేసింది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లోని విమానాశ్రయాల్లో చాలామంది ప్రయాణికులు చిక్కుకుపోయారు.
ఈ విచిత్ర సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. విమానాల రద్దు ఇబ్బంది వచ్చే ఏడాది ఫిబ్రవరికి కొనసాగుతుందని ఎయిర్‌లైన్ సంస్థ తెలిపింది.
