
పహల్గామ్: ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని ఉగ్ర స్థావరాలపై సర్జికల్ దాడుల నేపథ్యంలో మాజీ ఆర్మీ చీఫ్‌లు స్పందించడం గమనార్హం.
ముఖ్యంగా, మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణే చేసిన ‘‘సినిమా ఇంకా ఉంది’’ అనే సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అయ్యింది. మరోవైపు, మాజీ చీఫ్ జనరల్ శంకర్ రాయ్‌చౌదరి కూడా ఈ దాడులను ప్రశంసించారు. ‘‘ఇది యుద్ధం కాదు కానీ, అప్రకటిత యుద్ధం’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
దాడులను కొనసాగించాల్సిన అవసరం ఉందని, భారత్ సైన్యం మరింత ముందుకు వెళ్తేనే సమస్య పరిష్కారం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కల్నల్ సోఫియా ఖురేషి కీలక విషయాలను బయటపెట్టారు. గుల్పూర్ శిబిరంపై దాడి, ఉగ్రవాదులు గతంలో ఫూంచ్ సెక్టార్‌లో చేసిన దాడులు వంటి వివరాలు మీడియాకు తెలియజేశారు. దాడి వీడియోను ప్రదర్శించడంతో దేశవ్యాప్తంగా ఉత్సాహం నెలకొంది.
ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఈ దాడులకు సంబంధించిన పోస్టులు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. మాజీ ఆర్మీ చీఫ్‌లు, కేంద్రం నుంచి వచ్చిన స్పందనలు ప్రజల్లో జోష్ పెంచాయి. భారత్ ఉగ్రవాదంపై మరింత కఠినంగా ముందుకు వెళ్తుందా అనే ఆసక్తి మరింత పెరుగుతోంది.
