
న్యూస్ డెస్క్: అమెరికాలో ఉపాధి ఆశలతో వెళ్లిన భారతీయ విద్యార్థులు, ఉద్యోగుల పరిస్థితి కొన్నిసార్లు విషాదంగా మారుతోంది. ఈ నెల మొదట్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఒక యువతి ఇంకా కోమాలోనే ఉండడం ఆమె కుటుంబాన్ని కలచివేస్తోంది.
నవంబర్ 9న ఆర్తిసింగ్ అనే యువతి ఒక ఈవెంట్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా, రోడ్డు దాటుతుండగా ఒక వాహనం ఢీకొట్టింది. ఆ రోజు నుంచి ఆమె అపస్మారక స్థితిలో శాంటాక్లారా వ్యాలీ మెడికల్ సెంటర్ ఐసీయూలో చికిత్స పొందుతోంది.
కూతురు కోమాలో ఉంటే, ఆమె తండ్రి సుమిరన్ సింగ్ ఒంటరిగా విదేశీ గడ్డపై న్యాయ, వైద్య సవాళ్లను ఎదుర్కొంటున్నారు. న్యాయం చేయాలని వేడుకుంటున్నా, పోలీసులు డ్రైవర్ గుర్తింపును వెల్లడించకపోవడంతో ఆ తండ్రి తీవ్ర నిరాశలో ఉన్నారు.
అమెరికాలో బంధువులు, మద్దతు నెట్‌వర్క్ లేని సుమిరన్ సింగ్ కు వైద్య ఖర్చులు, భాష సమస్యలు తీవ్రంగా మారాయి. విదేశీ గడ్డపై ఒక తండ్రి ఒంటరిగా పోరాడుతుండటం చూసి భారత కమ్యూనిటీ గ్రూపులు ఆయనకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నాయి.
ఉత్తర కాలిఫోర్నియాలోని ‘ఓవర్సీస్ ఆర్గనైజేషన్ ఫర్ బెటర్ బిహార్’ (O2B2) సంస్థ రంగంలోకి దిగింది. వారు సుమిరన్ సింగ్ కు వసతి, రవాణా, భోజనం వంటి ప్రాథమిక అవసరాలు తీర్చడానికి నిధుల సేకరణ ప్రచారాన్ని ప్రారంభించారు.
ముఖ్యంగా కాలిఫోర్నియాలో పాదచారుల ప్రమాదాలు పెరుగుతుండడంపై ఈ కమ్యూనిటీ ఆందోళన వ్యక్తం చేసింది. రద్దీగా ఉండే రోడ్లపై మెరుగైన భద్రతా చర్యలు, ప్రమాదాల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
