Tuesday, October 6, 2026
HomeInternationalకెనడాలో మరో భారత సంతతి వ్యక్తి దారుణ హత్య..

కెనడాలో మరో భారత సంతతి వ్యక్తి దారుణ హత్య..

indian-origin-man-arvi-sagoo-killed-in-canada-confrontation

న్యూస్ డెస్క్: విదేశాల్లో భారతీయులు, భారత సంతతి వ్యక్తులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా కెనడాలో మరో విషాదం చోటుచేసుకుంది. భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త అర్వి సింగ్ సాగూ (55) ఓ అపరిచితుడి దాడిలో దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన కెనడాలోని ఎడ్మంటన్ నగరంలో అక్టోబర్ 19న జరిగింది.

రాత్రి భోజనం ముగించుకుని తన స్నేహితురాలితో కలిసి రెస్టారెంట్ నుంచి బయటకు వస్తున్న సాగూ, పార్కింగ్ స్థలంలో ఉన్న తన కారుపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేయడాన్ని గమనించారు. “ఏం చేస్తున్నావ్?” అని సాగూ నిలదీయగా, ఆ వ్యక్తి “నాకు నచ్చింది చేస్తా” అంటూ దురుసుగా సమాధానమిచ్చాడు.

మాటమాట పెరగడంతో, ఆ అపరిచితుడు సాగూ తలపై బలంగా కొట్టాడు. ఈ ఊహించని దాడికి సాగూ అక్కడికక్కడే కుప్పకూలి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వెంటనే ఆయన స్నేహితురాలు 911కు కాల్ చేయగా, పారామెడిక్స్ వచ్చి ఆసుపత్రికి తరలించారు.

ఆసుపత్రిలో ఐదు రోజుల పాటు లైఫ్ సపోర్ట్‌పై ఉన్న సాగూ, మృత్యువుతో పోరాడి గత శుక్రవారం ప్రాణాలు విడిచారు. ఈ ఘటనపై ఎడ్మంటన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని కైల్ పాపిన్‌గా గుర్తించి అరెస్టు చేశారు.

సాగూ మరణంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన అంత్యక్రియల ఖర్చులకు, పిల్లల పోషణకు మద్దతుగా స్నేహితుడు విన్సెంట్ నిధుల సేకరణ (ఫండ్‌రైజర్) ప్రారంభించారు.

ఈ ఘటన కెనడాలోని భారతీయ సమాజంలో భద్రతపై తీవ్ర ఆందోళనలను మరోసారి రేకెత్తించింది. కేవలం చిన్న వాగ్వాదానికే ప్రాణాలు తీయడం అక్కడి శాంతిభద్రతల పరిస్థితికి అద్దం పడుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular