
న్యూస్ డెస్క్: భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవం ఇప్పుడు కేవలం రెండు సంస్థల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఫోన్ పే, గూగుల్ పే (జీ పే) యాప్‌లు యూపీఐ మార్కెట్‌లో ఏకఛత్రాధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ రెండు యాప్‌లే దేశంలోని మొత్తం లావాదేవీలలో 80 శాతానికి పైగా నియంత్రిస్తుండటం ఇప్పుడు ఆందోళనకు దారితీస్తోంది.
ఈ “డ్యూయోపొలీ” (ఇద్దరి ఆధిపత్యం)పై ఇండియా ఫిన్‌టెక్ ఫౌండేషన్ (FF) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఫిన్‌టెక్ పరిశ్రమల స్వీయ నియంత్రణ మండలిగా ఉన్న ఈ సంస్థ, ఆర్బీఐకి, ఆర్థిక శాఖకు ఫిర్యాదు చేసింది. ఈ దిగ్గజాలు చిన్న సంస్థలను, దేశీ పోటీదారులను ఎదగనీయడం లేదని ఆరోపించింది.
ఈ ప్రైవేట్ యాప్‌ల దూకుడుకు ప్రభుత్వ రంగ సంస్థ అయిన ‘భీమ్’ యాప్ కూడా బలహీనపడింది. భారీ క్యాష్‌బ్యాక్‌లు, డిస్కౌంట్లు ఇస్తూ ఫోన్ పే, జీ పే సంస్థలు అనుసరిస్తున్న వ్యూహాల ముందు ‘భీమ్’ నిలవలేకపోయింది. ఫలితంగా మార్కెట్ వాటాను పూర్తిగా కోల్పోయింది.
నిజానికి, ఏ ఒక్క సంస్థా కూడా 30 శాతం కంటే ఎక్కువ మార్కెట్ వాటాను కలిగి ఉండకూడదని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నిబంధన ఉంది. కానీ, ఈ నిబంధన అమలులో NPCI తీవ్ర జాప్యం చేస్తోందని, ఈ జాప్యమే ప్రస్తుత గుత్తాధిపత్యానికి కారణమైందని FF విమర్శిస్తోంది.
పరిస్థితిని చక్కదిద్దడానికి, FF ఓ సూచన చేసింది. ఈ రెండు పెద్ద సంస్థలతో పాటు, చిన్న యూపీఐ యాప్‌లకు కూడా ప్రోత్సాహకాలలో (incentives) అధిక వాటా ఇవ్వాలని కోరింది. అప్పుడే మార్కెట్‌లో సమానమైన పోటీ నెలకొంటుందని అభిప్రాయపడింది.
ప్రస్తుతం దేశంలో 30కి పైగా థర్డ్-పార్టీ యాప్‌లు ఉన్నా, మార్కెట్ మొత్తం రెండే సంస్థల చేతిలో బందీగా ఉంది. ఈ ఫిర్యాదులపై రిజర్వ్ బ్యాంక్, NPCI ఎలాంటి చర్యలు తీసుకుంటాయో, 30% పరిమితిని అమలు చేస్తాయో లేదో వేచి చూడాలి.
