Monday, July 27, 2026
HomeLife Styleదేశానికి పెళ్లి కళ.. 2 నెలల్లో 46 లక్షల పెళ్లిళ్లు

దేశానికి పెళ్లి కళ.. 2 నెలల్లో 46 లక్షల పెళ్లిళ్లు

india-wedding-season-46-lakh-marriages-1-8-lakh-crore-business

న్యూస్ డెస్క్: దేశానికి అసలైన పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది. ఏడాది చివరిలో అత్యంత శుభప్రదంగా భావించే నవంబర్, డిసెంబర్ నెలల్లో దేశవ్యాప్తంగా ఏకంగా 46 లక్షల వివాహాలు జరగనున్నాయని అంచనా. ఈ మెగా వెడ్డింగ్ సీజన్ కేవలం కుటుంబాల్లోనే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థలోనూ కొత్త ఉత్సాహాన్ని నింపబోతోంది.

కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) అంచనాల ప్రకారం, ఈ రెండు నెలల వివాహాల ద్వారా దేశీయ మార్కెట్‌లో సుమారు రూ. 1.8 లక్షల కోట్ల భారీ వ్యాపారం జరగనుంది. 75 ప్రధాన నగరాల్లో నిర్వహించిన అధ్యయనంలో ఈ ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

ఈ సర్వేలో మరో ముఖ్యమైన అంశం వెలుగులోకి వచ్చింది: డెస్టినేషన్ వెడ్డింగ్‌ల ట్రెండ్ మారడం. గతంలో విదేశాలకు వెళ్లే సంపన్నులు, ఇప్పుడు స్వదేశీ వేదికలకే మొగ్గు చూపుతున్నారు. సంపన్నులలో 80-85% మంది భారత్‌లోనే వివాహాలు జరిపేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన “వెడ్ ఇన్ ఇండియా” పిలుపు ఈ మార్పుకు బలంగా దోహదపడిందని CAIT గుర్తించింది.

గతంలో డెస్టినేషన్ వెడ్డింగ్ అంటే రాజస్థాన్ ప్యాలెస్‌లు, గోవా రిసార్ట్‌లే గుర్తుకొచ్చేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. కేరళలోని వయనాడ్, కర్ణాటకలోని కూర్గ్, ఉత్తరాఖండ్‌లోని రిషికేష్, హిమాచల్‌లోని సోలన్, మేఘాలయలోని షిల్లాంగ్ వంటి కొత్త, అందమైన ప్రదేశాలకు ఎంక్వైరీలు భారీగా పెరిగినట్లు ఈ అధ్యయనం తేల్చింది.

పెళ్లిళ్ల కోసం ఖర్చు పెట్టే విషయంలో భారతీయులు ఏమాత్రం వెనకాడటం లేదని గణాంకాలు రుజువు చేస్తున్నాయి. 2022లో 32 లక్షల పెళ్లిళ్లకు రూ. 3.75 లక్షల కోట్లు ఖర్చు కాగా, 2023లో 38 లక్షల వివాహాలకు ఆ ఖర్చు రూ. 4.74 లక్షల కోట్లకు పెరిగింది. ఇక 2024లో జరిగిన 48 లక్షల పెళ్లిళ్లకు ఏకంగా రూ. 5.9 లక్షల కోట్లు ఖర్చు చేశారు.

గత రికార్డులను పరిశీలిస్తే, ఈ ఏడాది చివరి రెండు నెలల్లో (నవంబర్, డిసెంబర్) జరగనున్న 46 లక్షల వివాహాలకు రూ. 1.8 లక్షల కోట్లు ఖర్చు అవుతుందన్న అంచనా వాస్తవానికి దగ్గరగానే ఉంది. ఏది ఏమైనా, ఈ మెగా వెడ్డింగ్ సీజన్ దేశ ఆర్థిక వ్యవస్థకు మాత్రం భారీ బూస్ట్ ఇవ్వడం ఖాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular