
న్యూస్ డెస్క్: పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ చేసిన అణు బెదిరింపులపై భారత్ ఘాటు స్పందన వ్యక్తం చేసింది. అమెరికా భూభాగం నుంచి ఇలాంటి బాధ్యతారహిత వ్యాఖ్యలు చేయడం విచారకరమని విదేశాంగ శాఖ పేర్కొంది.
అసిమ్ మునీర్ ఇటీవల అమెరికా ఫ్లోరిడాలో పాకిస్థానీ వాసులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్‌తో యుద్ధం జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. “మేము అణ్వస్త్ర దేశం, మునిగిపోతే సగం ప్రపంచాన్ని తీసుకుపోతాం” అని ఆయన వ్యాఖ్యానించారు.
భారత్ దీనిపై కౌంటర్ ఇస్తూ, పాకిస్థాన్‌కు ఇలాంటి అణు ప్రగల్భాలు పలకడం పరిపాటేనని తెలిపింది. అంతర్జాతీయ సమాజం కూడా ఈ వ్యాఖ్యల అసలైన అర్థం గ్రహిస్తుందని పేర్కొంది.
విదేశాంగ శాఖ ప్రకటనలో, ఉగ్రవాద గ్రూపులతో సంబంధాలు ఉన్న సైన్యం చేతిలో అణ్వాయుధాల భద్రతపై ఎప్పటి నుంచో అనుమానాలు ఉన్నాయని గుర్తుచేసింది. ఇలాంటి బెదిరింపులు ఆ అనుమానాలను మరింత బలపరుస్తాయని తెలిపింది.
కేంద్ర ప్రభుత్వ వర్గాలు పాకిస్థాన్‌ను బాధ్యతారహిత అణ్వాయుధ దేశంగా అభివర్ణించాయి. అమెరికా మద్దతు వచ్చినప్పుడు ఆ దేశ సైన్యం తన అసలు స్వభావాన్ని బయటపెడుతుందని విమర్శించాయి. ప్రజాస్వామ్యం లేని పాకిస్థాన్‌లో సైన్యమే అంతా నియంత్రిస్తుందని పేర్కొన్నాయి.
ఇక మునీర్, సింధు నది జలాలపై భారత్ ఏదైనా ఆనకట్ట నిర్మిస్తే దానిని పది క్షిపణులతో ధ్వంసం చేస్తామని కూడా హెచ్చరించారు. తమ వద్ద క్షిపణుల కొరత లేదని ఆయన వ్యాఖ్యానించారు.