న్యూస్ డెస్క్: అమరావతి రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ జోష్ మీదకి వచ్చింది. రాజధాని నిర్మాణంపై స్పష్టత వచ్చి, మళ్లీ అభివృద్ధి పనులు ప్రారంభమైన నేపథ్యంలో భూముల కొనుగోలు, వెంచర్లు కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి. ముఖ్యంగా తుళ్లూరు, మంగళగిరి, వెంకటాయపాలెం ప్రాంతాల్లో తిరిగి పెట్టుబడిదారుల హడావుడి కనిపిస్తోంది.
2014 నుంచి 2019 వరకూ అమరావతిలో రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుంది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై లాంటి ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా వచ్చి భూములు, ఫ్లాట్లు కొనుగోలు చేశారు. కానీ 2019 తర్వాత పాలనా మార్పు, మూడు రాజధానుల ప్రతిపాదనతో ఈ ప్రాంతంలో మార్కెట్ పూర్తిగా కుదేలైంది. చాలామంది పెట్టుబడిదారులు వెనక్కు తగ్గారు.
ఈ నేపథ్యంలో తిరిగి అభివృద్ధి సాధ్యమా? అన్న సందేహాలు ఉత్పన్నమయ్యాయి. అయితే 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు హయాంలో స్పష్టత వచ్చి, అమరావతి అభివృద్ధికి పట్టుదలతో ముందుకెళ్తుండటంతో పరిస్థితులు మారాయి. ఈసారి ప్రభుత్వం రాజధానిని శాశ్వతంగా నిర్మించాలన్న సంకల్పంతో విస్తృత ప్రాజెక్టులను ప్రారంభించింది.
దీంతో పాటు, పెద్ద ఎత్తున రోడ్లు, డెవలప్‌మెంట్ పనులు, ప్రాజెక్టుల టెండర్లు మొదలవడం, వ్యాపారులకు ఇచ్చే ప్రోత్సాహకాలు కూడా మార్కెట్‌కి తిరిగి ఊపందించాయి. ముఖ్యంగా రోజూ 20-30 రియల్ ఎస్టేట్ లావాదేవీలు జరుగుతున్నాయని సమాచారం. బ్యాంకింగ్, కన్సల్టెన్సీ, కన్‌స్ట్రక్షన్ రంగాలవారంతా మళ్లీ అమరావతిపై దృష్టి పెట్టారు.
తాజాగా హైదరాబాద్, గోదావరి, చెన్నై ప్రాంతాల నుంచి కూడా వ్యాపారులు వచ్చి ఇక్కడ భూములు కొనుగోలు చేస్తున్నారని తెలుస్తోంది. వాస్తవానికి మొదటి ఏడాది చప్పగా ఉన్నా.. ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారాయని అనిపిస్తోంది. రాజధాని పునర్నిర్మాణం వేగం పుంజుకోవడంతో రియల్ ఎస్టేట్ రంగం బంగారు దశలోకి వెళ్లే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
