న్యూస్ డెస్క్: మంగళవారం హైదరాబాద్ నగరంలో పెద్ద కలకలం రేగింది. నాలుగు ప్రముఖ ప్రాంతాలకు బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
ఈ-మెయిల్స్ సిటీ సివిల్ కోర్టు, జడ్జి ఛాంబర్స్, జింఖానా క్లబ్, రాజ్‌భవన్‌లకు వచ్చాయి. ‘అబీదా అబ్దుల్లా’ అనే ఐడీ నుంచి ఈ బెదిరింపులు వచ్చినట్టు తెలుస్తోంది.
ఈమెయిల్‌లో RDX, IED పేలుడు పదార్థాలు అమర్చినట్టు పేర్కొనడంతో అధికారులు వెంటనే కోర్టును ఖాళీ చేయించి, ప్రజలను బయటకు పంపించారు.
బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లు వెంటనే ఘటనాస్థలాలకు చేరుకొని మూడు గంటల పాటు తనిఖీలు జరిపాయి.
తదుపరి విచారణలో ఎలాంటి బాంబులు లభించకపోవడంతో, ఇది బూటకపు బెదిరింపు అని పోలీసులు తేల్చారు. ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, బెదిరింపు మెయిల్ పంపిన వారిని గుర్తించేందుకు సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేస్తున్నారు.