
న్యూస్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగ చరిత్రలో ఒక చారిత్రక ఘట్టం నమోదైంది. ప్రపంచ దిగ్గజ సంస్థ గూగుల్, విశాఖపట్నంలో 1 గిగావాట్ సామర్థ్యం గల హైపర్‌స్కేల్ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు కోసం గూగుల్ ఏకంగా 15 బిలియన్ అమెరికన్ డాలర్లు (సుమారు రూ. 1.25 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టనుంది. ఈ పెట్టుబడి అమెరికా వెలుపల గూగుల్ చేస్తున్న అతి పెద్ద పెట్టుబడి అని గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ తెలిపారు.
ఈ భారీ ప్రాజెక్టు ద్వారా ఏటా రూ. 10,518 కోట్లు రాష్ట్ర స్థూల ఉత్పత్తి (GSDP)కి తోడ్పాటు లభిస్తుందని అంచనా. అంతేకాకుండా, సుమారు 1.88 లక్షల ఉద్యోగాలు (నేరుగా, పరోక్షంగా) సృష్టికావచ్చని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ కేంద్రం ద్వారా జెమినీ-ఏఐతో సహా గూగుల్ క్లౌడ్ సేవలు అందుబాటులోకి వస్తాయి.
ఈ డేటా సెంటర్ 2028-2032 మధ్య పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించనుంది. విశాఖపట్నం ‘ఏఐ సిటీ’గా రూపుదిద్దుకునే దిశగా ఇది కీలక అడుగుగా నిలవనుంది. రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్ ఈ ప్రాజెక్టును ఏపీని గ్లోబల్ టెక్ మ్యాప్‌లో బలంగా నిలబెట్టే మైలురాయిగా అభివర్ణించారు.
ఈ ప్రాజెక్టు కోసం గూగుల్ పునరుత్పాదక విద్యుత్‌ను వినియోగించాలని నిర్ణయించింది. దీనికోసం ప్రత్యేక విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి సుమారు రూ. 20,000 కోట్లు ఖర్చు చేయనుంది. అంతర్జాతీయ బ్యాండ్‌విడ్త్‌ను పెంచేందుకు మూడు సబ్‌మెరైన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసి డేటా సెంటర్‌ను అనుసంధానించనుంది.
న్యూ ఢిల్లీలో జరిగిన ఈ ఒప్పంద కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సహా గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టు పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
