
న్యూస్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో ప్రపంచ దేశాల్లో చర్చకు తెరలేపారు. ఎప్పుడు ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉండే ఆయన, ఈసారి యూరోపియన్ దేశాల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాలు వలసల కారణంగా నాశనమవుతున్నాయని ఆయన విమర్శించారు. యూరోప్ దేశాలు తమ విధానాలతో విపత్తును కొనితెచ్చుకుంటున్నాయని, వలసలను అడ్డుకోవడంలో అక్కడి ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని మండిపడ్డారు.
నాటో కూటమి తనను ‘డాడీ’ అని పిలుస్తుందని చెబుతూనే, రక్షణ వ్యయం విషయంలో ఆ దేశాల తీరును తప్పుబట్టారు. మాటలు చెప్పడమే తప్ప, యుద్ధ సమయంలో సాయం చేయడానికి ఆ దేశాలు ముందుకు రావడం లేదని అసహనం వ్యక్తం చేశారు.
ఇక ఉక్రెయిన్ లో వెంటనే ఎన్నికలు జరగాలని, లేదంటే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని జెలెన్ స్కీకి సూచించారు. అయితే యుద్ధం ఆగి, శాంతి నెలకొంటేనే ఎన్నికలకు వెళ్తామని జెలెన్ స్కీ కూడా ట్రంప్ కు గట్టిగానే బదులిచ్చారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి తాను ప్రయత్నిస్తుంటే, యూరోప్ దేశాలు మాత్రం విభేదిస్తున్నాయని ట్రంప్ అన్నారు. భూభాగాలను వదులుకోవాల్సి వస్తుందనే భయంతోనే ఆ దేశాలు తన శాంతి ప్రయత్నాలకు అడ్డుపడుతున్నాయని ఆరోపించారు.
మరోవైపు అమెరికా భద్రత కోసం వీసాలు, వలసల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మొత్తానికి మిత్రదేశాలైన యూరోప్ పైనే ట్రంప్ ఇలా విరుచుకుపడటం ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్ గా మారింది.
