
న్యూస్ డెస్క్: సెలబ్రిటీలందరిలో లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం సాధారణమే. కానీ, బ్రిటన్‌కు చెందిన ప్రముఖ నటి, గాయనీ సింథియా ఎరివో తన నోటికి, ప్రత్యేకంగా తన నవ్వుకు రూ.16.5 కోట్ల ఇన్సూరెన్స్ తీసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. సింథియా లిస్టెరిన్ మౌత్‌వాష్ బ్రాండ్ ప్రచారకర్తగా ఉండగా, తన నోటి ఆరోగ్యాన్ని ఎంత ప్రాధాన్యంగా చూస్తారో ఇలా నిరూపించారు.
తన నవ్వులో, గొంతులోనే తన విజయ రహస్యం ఉందని సింథియా అంటున్నారు. వేదికపైకి వెళ్లేముందు ప్రతిసారీ బ్రష్ చేసి, మౌత్‌వాష్ వాడటం తాను అలవాటుగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఈ అలవాటు వల్లే ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, రెండు దంతాల మధ్య గ్యాప్, తన ప్రత్యేక నవ్వును కాపాడేందుకు బీమా తీసుకున్నట్టు చెప్పారు.
38 ఏళ్ల సింథియా నటన, పాటలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఎమ్మీ, గ్రామీ, టోనీ అవార్డులను గెలుచుకొని, ఆస్కార్‌కు కూడా నామినేట్ అయ్యారు. ప్రస్తుతం ఆమె నటించిన ‘విక్‌డ్: ఫర్ గుడ్’, ‘చిల్డ్రన్ ఆఫ్ బ్లడ్ అండ్ బోన్’ త్వరలో విడుదల కానున్నాయి. ఆమె తీసుకున్న ఇన్సూరెన్స్ నిర్ణయం హాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.
ఇలా సెలబ్రిటీల్లో వింత ఇన్సూరెన్స్ ట్య్రాడిషన్ ఉంది. జెన్నిఫర్ లోపెజ్ తన వీపు భాగానికి, మారియా కరే తన కాళ్లు, స్వరం కోసం కోట్ల రూపాయల బీమా తీసుకున్నారు. ఫుట్‌బాల్ స్టార్లు రొనాల్డో, బెక్‌హమ్ తమ కాళ్లకు, చెఫ్ గోర్డన్ రామ్‌సే తన నాలుకకు ఇన్సూరెన్స్ తీసుకున్నారు. కానీ నవ్వుకు ఇన్సూరెన్స్ తీసుకున్న తొలి హీరోయిన్‌గా సింథియా ఎరివో గుర్తింపు తెచ్చుకున్నారు.