
న్యూస్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ నేతల విగ్రహాలను దుండగులు ధ్వంసం చేస్తుండటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహాల జోలికొస్తే తాట తప్పదని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ విభేదాలు విమర్శలకే పరిమితం కావాలని, దివంగత నేతల విగ్రహాలను అవమానించడం సరికాదని హెచ్చరించారు.
ఇటీవల కృష్ణా జిల్లాలోని కైకలూరులో వంగవీటి రంగా విగ్రహాన్ని కూల్చివేసిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. దీనిపై స్పందించిన సీఎం, నిందితులను 24 గంటల్లోగా గుర్తించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఏ పార్టీకి చెందినవారైనా కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.
ఈ సంఘటన అనంతరం కాకినాడలో జరిగిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో కూడా చంద్రబాబు స్పందించారు. చెత్త సమస్య పరిష్కారానికి ప్రజలందరూ సహకరించాలని, రాష్ట్రాన్ని చెత్తరహితంగా మార్చడమే లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో స్వయంగా చీపురు పట్టి పరిసరాలను శుభ్రం చేశారు.
ప్రధానమంత్రి మోదీ ఢిల్లీలో ప్రారంభించిన ప్రాజెక్టులో వెయ్యి టన్నుల చెత్తను బ్రిడ్జి నిర్మాణంలో ఉపయోగించిన ఉదాహరణను ప్రస్తావిస్తూ, అదే విధానాన్ని ఏపీలో కూడా ముందుగా అమలు చేశామని కానీ ప్రభుత్వ మార్పుతో ఆగిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతి నగరంలో చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాలను ఏర్పాటు చేయాలని త్వరలోనే చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. విగ్రహాల పరిరక్షణతో పాటు ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆయన పునరుద్ఘాటించారు.