
న్యూస్ డెస్క్: ఇండిగో సంక్షోభంపై జాతీయ మీడియా డిబేట్ లో టీడీపీ అధికార ప్రతినిధి దీపక్ రెడ్డి చేసిన అనాలోచిత వ్యాఖ్యలు పెద్ద వివాదంగా మారాయి. పరిస్థితి పార్టీకి డ్యామేజ్ చేసేలా మారుతోందని గమనించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తక్షణమే రంగంలోకి దిగారు. పార్టీ అధికార ప్రతినిధులతో అత్యవసరంగా సమావేశమయ్యారు.
టీవీ డిబేట్లకు వెళ్లేటప్పుడు పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని, యథాలాపంగా మాట్లాడి పార్టీకి డ్యామేజ్ చేయకూడదని సీఎం సూచించారు. ఆర్ టీవీ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామితో గ్యాప్ రావడానికి దీపక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే కారణమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
దీపక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తప్పేనని చెప్పిన చంద్రబాబు, ఆ తర్వాత ఆయన తెలుగు ఛానెల్లో అర్నాబ్‌పై విమర్శలు చేసి వివాదాన్ని మరింత దిగజార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సున్నితమైన విషయాల్లో అధికార ప్రతినిధులు చాలా అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు.
జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామితో టీడీపీకి మంచి సంబంధాలు ఉన్నాయని, అనవసర వివాదాలతో ఆయన్ను టార్గెట్ చేయడం సరికాదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆర్ టీవీతో వివాదాన్ని తక్షణమే పరిష్కరించుకుని, ఇంతకు ముందున్న సంబంధాలను పునరుద్ధరించాలని నేతలకు ఆదేశించారు.
ఇండిగో సంక్షోభంపై చర్చ సందర్భంగా దీపక్ రెడ్డి.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు బదులు మంత్రి లోకేశ్ జోక్యం చేసుకున్నారని పదే పదే చెప్పడంతో అర్నాబ్ గోస్వామి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వివాదాన్ని వైసీపీ హైలైట్ చేయడంతో టీడీపీ ప్రతిష్ట దెబ్బతిన్నట్లు విశ్లేషణలు రావడంతో, చంద్రబాబు జోక్యం తప్పలేదని అంటున్నారు.
