
న్యూస్ డెస్క్: టీడీపీ సంస్థాగత వ్యవహారాలపై సీఎం చంద్రబాబు పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. వరుసగా రెండో శనివారం ఆయన పార్టీ కార్యాలయానికి వచ్చారు. పాలనతో పాటు పార్టీని పట్టించుకోకపోతే ఇబ్బందులు వస్తాయని భావించి, ఇకపై వారంలో ఒకరోజు పార్టీకే కేటాయించాలని ఆయన నిర్ణయించుకున్నారు.
ఈరోజు భేటీలో ప్రధానంగా తిరువూరు పంచాయతీపైనే చర్చ జరగనుంది. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, ఎంపీ కేశినేని చిన్ని మధ్య వివాదంపై క్రమశిక్షణ సంఘం నేడు చంద్రబాబుకు నివేదిక ఇవ్వనుంది. దీంతో ఈ గొడవకు బాబు ఇవాళ ఫుల్‌స్టాప్ పెట్టే అవకాశం ఉంది.
దీంతో పాటు, మే నెల మహానాడు నుంచి పెండింగ్‌లో ఉన్న జిల్లా కమిటీల నియామకంపై కూడా తుది నిర్ణయం తీసుకోనున్నారు. మరో మూడు నెలల్లో స్థానిక ఎన్నికలు రానుండటంతో, పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేయడంపై ఆయన ఫోకస్ పెట్టారు.
నామినేటెడ్ పోస్టుల (ఆలయ, మార్కెట్ కమిటీలు) భర్తీలో జాప్యంపైనా చంద్రబాబు సీరియస్‌గా ఉన్నారు. ఎమ్మెల్యేల పనితీరుపై నివేదికలు తెప్పించుకున్నట్లు సమాచారం.
మరోవైపు, నవంబర్ 11 నుంచి మండల, గ్రామ కమిటీల ప్రమాణ స్వీకారాలు ఉంటాయని పల్లా శ్రీనివాసరావు ప్రకటించారు. చంద్రబాబు తాజా భేటీతో పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.
