
న్యూస్ డెస్క్: ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGIA) శుక్రవారం సాంకేతిక లోపంతో కుప్పకూలింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) వ్యవస్థలో తలెత్తిన తీవ్ర సమస్య కారణంగా 800కు పైగా విమానాలు ఆలస్యమయ్యాయి, వేలాది మంది ప్రయాణికులు గంటల తరబడి టెర్మినల్స్‌లో చిక్కుకుపోయారు.
ఈ అంతరాయానికి ఆటోమేటిక్ మెసేజ్ స్విచ్చింగ్ సిస్టమ్ (AMSS) విఫలం కావడమే కారణమని అధికారులు గుర్తించారు. ఈ వ్యవస్థ ఏటీసీకి విమానాల ఫ్లైట్ ప్లాన్ డేటాను పంపుతుంది. ఇది ఆగిపోవడంతో, సిబ్బంది మొత్తం సమాచారాన్ని మాన్యువల్‌గా నమోదు చేయాల్సి వచ్చింది.
దీనికి తోడు, పైలట్లకు వాతావరణ సమాచారం అందించే ATIS వ్యవస్థ కూడా పనిచేయకపోవడంతో గందరగోళం పెరిగింది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI), ECIL నిపుణులు రాత్రంతా శ్రమించి వ్యవస్థను పునరుద్ధరించారు.
ఈ ప్రభావం కేవలం ఢిల్లీకే పరిమితం కాలేదు. భారీ బ్యాక్‌లాగ్ కారణంగా ముంబై, జైపూర్, లక్నో, చండీగఢ్ వంటి నగరాల్లోనూ విమాన రాకపోకలకు అంతరాయం కలిగింది.
రాత్రికి పరిస్థితి అదుపులోకి వచ్చినా, ఈ ఘటనపై AAI పూర్తిస్థాయి విచారణకు ఆదేశించింది. భవిష్యత్తులో ఇలాంటి లోపాలు తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.
