
మెట్రో నగరాల్లో రవాణా కష్టాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సరికొత్త అడుగు వేస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఆధిపత్యం చలాయిస్తున్న ఓలా, ఉబర్ వంటి ప్రైవేటు సంస్థలకు పోటీగా ‘భారత్ ట్యాక్సీ‘ సర్వీసులను ప్రారంభించబోతోంది. అధిక ఛార్జీలు, డ్రైవర్ల రైడ్ క్యాన్సిలేషన్లు వంటి సమస్యలతో విసిగిపోయిన ప్రయాణికులకు, తక్కువ కమిషన్లతో ఇబ్బంది పడుతున్న డ్రైవర్లకు ఈ నిర్ణయం పెద్ద ఊరటనివ్వనుంది.
ఈ భారత్ ట్యాక్సీ వల్ల ప్రయాణికులకు పలు ప్రయోజనాలు కలగనున్నాయి. రద్దీ సమయాల్లో (పీక్ అవర్స్) ఇష్టానుసారంగా పెంచే ఛార్జీలు ఇకపై ఉండవు. ధరలు స్థిరంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. అన్నింటికంటే ముఖ్యంగా ప్రభుత్వ గుర్తింపు పొందిన డ్రైవర్లు ఉండటం వల్ల మహిళలు, సాధారణ ప్రయాణికులకు భద్రతపై భరోసా లభిస్తుంది. ప్రైవేటు సంస్థలతో పోలిస్తే తక్కువ ఖర్చుతోనే సురక్షిత ప్రయాణం సాధ్యమవుతుంది.
డ్రైవర్ల విషయంలోనూ ఈ వ్యవస్థ కీలక మార్పులు తీసుకురానుంది. ప్రస్తుతం ఉన్న సంస్థలు డ్రైవర్ సంపాదనలో 30 శాతం వరకు కమిషన్ వసూలు చేస్తుండగా, భారత్ ట్యాక్సీలో ఇది కేవలం 20 శాతానికే పరిమితం కానుంది. మెయింటినెన్స్, ట్యాక్సుల రూపంలో తక్కువ మొత్తం కట్ అవ్వడం వల్ల డ్రైవర్ల ఆదాయం మెరుగుపడుతుంది. ఇది డ్రైవర్లు, యజమానుల ఆర్థిక స్థితిగతులను మార్చే అవకాశముంది.
భారత పౌర రవాణా విభాగంలో ఒక విప్లవంగా భావిస్తున్న ఈ సేవలు జనవరి 1 నుంచి దేశ రాజధాని ఢిల్లీలో ప్రయోగాత్మకంగా ప్రారంభం కానున్నాయి. అక్కడ ఈ ప్రయోగం విజయవంతమైతే, అతి త్వరలోనే హైదరాబాద్ వంటి అన్ని ప్రధాన నగరాలకు భారత్ ట్యాక్సీ సేవలను విస్తరించనున్నారు. సామాన్యులకు అందుబాటు ధరలో క్యాబ్ సేవలు అందించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం.
