
న్యూస్ డెస్క్: భారత క్రికెట్ జట్టులో కొత్తగా ప్రవేశపెట్టిన బ్రోంకో టెస్ట్ ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ఈ టెస్ట్ ద్వారా ఆటగాళ్ల ఫిట్నెస్ ప్రమాణాలను మరింత కఠినంగా పరిశీలించనున్నారు. కానీ, మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ దీనిపై సంచలన ఆరోపణలు చేశారు.
తివారీ ప్రకారం, ఈ టెస్ట్ రోహిత్ శర్మను లక్ష్యంగా చేసుకున్నదే. 2027 ప్రపంచకప్ జట్టులో ఆయనకు చోటు ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకువచ్చిందని అన్నారు. “కోహ్లీని తప్పించడం కష్టం. కానీ రోహిత్ విషయంలో ప్రణాళికలు వేరుగా ఉన్నాయనిపిస్తోంది” అని ఆయన వ్యాఖ్యానించారు.
బ్రోంకో టెస్ట్‌లో ఆటగాళ్లు 20, 40, 60 మీటర్ల దూరం పలుమార్లు వేగంగా పరిగెత్తాలి. ఇది బీటెస్ట్ కంటే కఠినమని కోచ్ అడ్రియన్ లే రౌక్స్ సూచించగా, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా దీనికి మద్దతు తెలిపారట. ఇంగ్లండ్ సిరీస్‌లో ఆటగాళ్ల ఫిట్నెస్ సమస్యలు ఈ టెస్ట్ అమలుకు కారణమని సమాచారం.
“ఇప్పుడే ఎందుకు? కొత్త కోచ్ బాధ్యతలు చేపట్టినప్పుడు ఎందుకు అమలు చేయలేదు? ఇది ఎవరిప్లాన్?” అని తివారీ ప్రశ్నించారు. ఈ ప్రశ్నలు ప్రస్తుతం క్రికెట్ అభిమానుల్లో పెద్ద చర్చకు దారితీశాయి.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ 2027 ప్రపంచకప్ వరకు ఆడాలనే సంకల్పంతో ఉన్న సమయంలో ఈ కొత్త టెస్ట్, ముఖ్యంగా రోహిత్ భవిష్యత్తుపై ప్రశ్నార్థకం రేకెత్తిస్తోంది.