
బనకచర్ల ప్రాజెక్టు విషయమై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, ఇది రాష్ట్ర హక్కులపై తీవ్ర ముప్పుగా మారుతుందని హెచ్చరించారు.
ఈ ప్రాజెక్టు జీఆర్ఎంబీ, సీడబ్ల్యూసీ మార్గదర్శకాలు, అపెక్స్ కౌన్సిల్ ఆదేశాలకు వ్యతిరేకంగా ఉందని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రులకు లేఖలు రాసి అభ్యంతరాలు తెలిపామని తెలిపారు.
సి.ఆర్. పాటిల్‌తో జరిగిన చర్చల్లో ఆయన ‘ప్రతిపాదనలు వచ్చిన తర్వాత చట్టపరమైన పరిశీలన జరుగుతుంది’ అని హామీ ఇచ్చారని తెలిపారు. అన్యాయం జరిగితే తాము రాజీలేని పోరాటానికి సిద్ధమని ఉత్తమ్ పేర్కొన్నారు.
కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని గుర్తు చేస్తూ, గత బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని ఆరోపించారు. 724 టీఎంసీల వాటాలో 1,254 టీఎంసీల నీటిని ఏపీ తరలించుకుపోయిందని విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టును తుమ్మిడిహట్టి వద్ద కాకుండా మేడిగడ్డ వద్ద నిర్మించడం వల్ల రూ.68 వేల కోట్ల వ్యయం జరిగిందని గుర్తు చేశారు. తెలంగాణకు కేవలం 299 టీఎంసీలే సరిపోతుందని గత ప్రభుత్వం సంతకం చేశిందన్నారు.
ఇప్పటి బీజేపీ మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ చొరవ చూపించి తెలంగాణ హక్కుల కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.