
న్యూస్ డెస్క్: దలైలామా వారసత్వం విషయంలో చైనా చేస్తున్న జోక్యాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. 15వ దలైలామాను ఎవరు కావాలన్న నిర్ణయం పూర్తిగా ప్రస్తుత దలైలామా, ఆయన సంస్థదేనని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు.
గడెన్ ఫోడ్రాంగ్ ట్రస్టుకు ఈ నిర్ణయంపై పూర్తి అధికారం ఉందని దలైలామా బుధవారం ప్రకటించారు. అయితే వెంటనే చైనా స్పందిస్తూ, తమ ఆమోదం లేకుండా వారసుడిని గుర్తించరాదని డిమాండ్ చేసింది.
ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కఠినంగా స్పందించింది. “ఇది పూర్తిగా దలైలామా నిర్ణయం. మానవ హక్కులకు ఇది సంబంధించిన విషయం” అని రిజిజు వ్యాఖ్యానించారు. టిబెటన్ బౌద్ధవాదం కేవలం టిబెట్‌వాళ్లకే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనుచరులకు ప్రాముఖ్యత కలిగి ఉందని ఆయన అన్నారు.
ధర్మశాలలో జరుగుతున్న దలైలామా 90వ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడానికి రిజిజు వెళ్లనున్నారు. చైనా తమకు అనుకూలంగా ఉండే వారిని దలైలామాగా నియమించాలని ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది.
భారత్ మాత్రం ఈ విషయంలో స్పష్టంగా తన మద్దతును దలైలామాకు ప్రకటించడంతో, ఈ అంశం అంతర్జాతీయంగా మరింత ప్రాధాన్యతను పొందింది.