
న్యూస్ డెస్క్: ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్న నకిలీ మద్యం తయారీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కుంభకోణంలో ప్రమేయం ఉందన్న ఆరోపణలపై వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌ను సిట్ (SIT) అధికారులు అరెస్ట్ చేశారు.
ఆదివారం ఉదయం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసానికి వెళ్లిన సిట్ బృందం, జోగి రమేష్‌తో పాటు ఆయన అనుచరుడు ఆరేపల్లి రామును అదుపులోకి తీసుకుంది. అనంతరం వారిని విచారణ నిమిత్తం విజయవాడ ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు.
ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దన రావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే ఈ అరెస్ట్ జరిగినట్లు తెలుస్తోంది. నకిలీ మద్యం తయారీ వెనుక జోగి రమేష్ ప్రోద్బలం ఉందని జనార్దన రావు ఆరోపించినట్లు సమాచారం.
ఆఫ్రికాలో డిస్టిలరీ ఏర్పాటుకు తనకు రూ. 3 కోట్లు సాయం చేస్తానని రమేష్ హామీ ఇచ్చారని, అందుకు బదులుగా చిత్తూరు జిల్లాలో నకిలీ మద్యం తయారీ ప్రారంభించాలని సూచించారని జనార్దన రావు తన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి.
జనార్దన రావు వాంగ్మూలాన్ని అధికారులు వీడియో రికార్డ్ చేశారు. అంతేకాకుండా, సెప్టెంబర్ 23న ఆయన జోగి రమేష్ ఇంటికి వెళ్లినట్లు చెప్పడంతో, ఆనాటి సీసీటీవీ ఫుటేజీని కూడా సిట్ సేకరించినట్లు తెలుస్తోంది. ఈ సాక్ష్యాల ఆధారంగానే సిట్ అధికారులు రమేష్‌ను అరెస్ట్ చేశారు.
అయితే, జోగి రమేష్ తన అరెస్ట్‌ను ఖండించారు. ఇది పూర్తిగా కక్షసాధింపు చర్యేనని ఆరోపించారు. ఆయన అరెస్ట్ సమయంలో ఇబ్రహీంపట్నంలోని నివాసం వద్ద హైడ్రామా నెలకొంది, వైసీపీ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు.
