
న్యూస్ డెస్క్: అమెరికాలో ఓ విమానంలో హైజాక్ కలకలం రేగింది. కాక్‌పిట్‌లోకి ఎవరో బలవంతంగా చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారని భావించిన పైలట్లు, విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. తీరా విచారణలో అది హైజాక్ కాదని, కేవలం కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల జరిగిన పొరపాటు అని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
వివరాల్లోకి వెళితే, అమెరికన్ ఎయిర్‌లైన్స్ ‘స్కైవెస్ట్’కు చెందిన 6469 విమానం సోమవారం రాత్రి లాస్ ఏంజిల్స్‌కు బయలుదేరింది. విమానం గాల్లోకి లేచిన 40 నిమిషాలకే ఈ గందరగోళం మొదలైంది.
విమానం గాల్లో ఉండగా, పైలట్లు ఇంటర్‌కామ్ ద్వారా సిబ్బందితో మాట్లాడేందుకు ప్రయత్నించారు. కానీ సాంకేతిక లోపం కారణంగా ఇంటర్‌కామ్ పనిచేయలేదు. దీంతో పైలట్లతో కమ్యూనికేకేషన్ పూర్తిగా నిలిచిపోయింది.
పైలట్ల నుంచి స్పందన లేకపోవడంతో, ఓ ఫ్లైట్ అటెండెంట్ వారిని సంప్రదించేందుకు కాక్‌పిట్ డోర్‌ను తట్టారు. అయితే, లోపలున్న పైలట్లు ఆ శబ్దాన్ని మరోలా అర్థం చేసుకున్నారు. ఎవరో బలవంతంగా డోర్ తెరిచి, విమానాన్ని హైజాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
వెంటనే అప్రమత్తమైన పైలట్లు, ఎమర్జెన్సీ ప్రకటించి, విమానాన్ని సమీపంలోని నెబ్రస్కాలోని ఒమాహా ఎయిర్‌ఫీల్డ్‌కు దారి మళ్లించారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన వెంటనే పోలీసులు చుట్టుముట్టి తనిఖీలు చేపట్టారు.
విచారణలో అసలు విషయం బయటపడింది. ఇంటర్‌కామ్ పనిచేయకపోవడం వల్లే సిబ్బంది డోర్ తట్టారని, అది హైజాక్ కాదని తేలింది. కమ్యూనికేషన్ లోపం వల్లే పైలట్లు అత్యవసర పరిస్థితిని ప్రకటించాల్సి వచ్చిందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) కూడా ధృవీకరించింది.
