
న్యూస్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి తొలి శాశ్వత భవనం రూపుదిద్దుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీఏ) కొత్త ప్రధాన కార్యాలయాన్ని తాజాగా ప్రారంభించారు.
అధికారంలోకి వచ్చిన పదహారు నెలల వ్యవధిలోనే ఒక భారీ శాశ్వత నిర్మాణం పూర్తి కావడం రాజధాని నిర్మాణానికి సంబంధించి ఒక కీలక పరిణామంగా చూస్తున్నారు.
ఈ ప్రారంభోత్సవంతో అమరావతి విషయంలో కూటమి ప్రభుత్వం తన నిబద్ధతను చాటుకుంది. రానున్న రోజుల్లో మరిన్ని శాశ్వత నిర్మాణాలు చోటు చేసుకుంటాయని అంచనా వేస్తున్నారు. 2026 నాటికి ఉద్యోగుల భవనాలు పూర్తి అయి ప్రారంభానికి సిద్ధం అవుతాయని, దీంతో కొత్త ఏడాది మొదటి నుంచి అమరావతిలో యాక్టివిటీ పెద్ద ఎత్తున మొదలవుతుందని అంచనా వేస్తున్నారు.
సీఆర్డీఏ భవనం ఎదురుగా చంద్రబాబు తీసుకున్న ఫోటో, ‘అమరావతి రాజధాని ఇదిగో అభివృద్ధి ఇదిగో’ అని అందరికీ తెలియచేస్తున్నట్లుగా ఉంది. ఈ భరోసాతో అమరావతి రైతులలో ధీమా పెరిగింది. వారి సమస్యలను పరిష్కరించే బాధ్యతలను చంద్రబాబు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ లకు అప్పగించారు.
2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక అమరావతిని రాజధానిగా ప్రకటించింది. ఏకంగా 33 వేల ఎకరాలను రైతుల నుంచి భూ సమీకరణ ద్వారా ప్రభుత్వం తీసుకుంది. 2019 నాటికి తాత్కాలిక సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు వంటి నిర్మాణాలు తయారయ్యాయి.
అయితే, 2019లో వచ్చిన వైసీపీ ప్రభుత్వం అమరావతిపై దృష్టి పెట్టకుండా, మూడు రాజధానులు అంటూ కొత్త నినాదం అందుకోవడంతో అయిదేళ్లు పనులు ఆగిపోయాయి. ఈసారి కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడంతో అమరావతి రాజధాని పనులు తిరిగి జోరందుకున్నాయి.
