
న్యూస్ డెస్క్: భారత క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్‌గా ఉండటం తన కెరీర్‌లోనే అతి పెద్ద సవాల్ అని మాజీ పేసర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశారు. తాము తీసుకునే ఒక్కో నిర్ణయం ఆటగాళ్ల కెరీర్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని ఆయన వివరించారు. అందుకే, ఆటగాడిగా, కామెంటేటర్‌గా పనిచేసినప్పటికన్నా సెలెక్టర్‌గా తీవ్రమైన ఒత్తిడి ఉంటుందని అగార్కర్ అభిప్రాయపడ్డారు.
సెలెక్టర్‌గా ఒకసారి 15 మంది సభ్యులతో జట్టును ఎంపిక చేశాక, తమ చేతుల్లో ఏమీ ఉండదని అగార్కర్ తెలిపారు. “మేం అందరినీ సంతోషపెట్టలేం. కానీ మాకు అందుబాటులో ఉన్న సమాచారంతో అత్యుత్తమ జట్టును ఎంపిక చేసేందుకు ప్రయత్నిస్తాం,” అని ఆయన అన్నారు. భారత దేశంలో ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఎక్కువ సంఖ్యలో ఉండటం కూడా సెలక్షన్ ప్రక్రియను మరింత కఠినంగా మారుస్తోందని ఆయన పేర్కొన్నారు.
భారత్‌లో క్రికెట్‌కు ఉన్న ఆదరణ వల్ల తమ నిర్ణయాలపై విమర్శలు రావడం సహజమేనని అంగీకరించారు. అయితే, సోషల్ మీడియాలో వచ్చే విమర్శలు, ట్రెండింగ్‌లను తాను అస్సలు పట్టించుకోనని స్పష్టం చేశారు. “అది అనవసరమైన పని. మేం ఏడాది పొడవునా ఎంతో క్రికెట్‌ను గమనించి, దాని ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటాం,” అని అగార్కర్ తెలిపారు.
తన క్రికెట్ ప్రయాణంలోని మూడు దశలను పోలుస్తూ అగార్కర్ మాట్లాడారు. కామెంటేటర్ పనే అన్నింటికంటే చాలా తేలికైనదని ఆయన అన్నారు. సరైన సమయంలో సరైన పదాలు మాట్లాడితే పని పూర్తవుతుందని వివరించారు.
ఇక ఆటగాడిగా దొరికే సంతృప్తి మరెక్కడా ఉండదని అగార్కర్ తెలిపారు. మైదానంలో ఉన్నప్పుడు మన ప్రదర్శన పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. గెలుపోటములను మన ఆటతీరే నిర్దేశిస్తుంది. కానీ సెలెక్టర్ బాధ్యత వీటన్నిటికీ పూర్తి భిన్నంగా ఉంటుందని ఆయన ఎన్‌డీటీవీ వరల్డ్ సమ్మిట్ 2025లో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
