Tuesday, March 17, 2026
HomeSportsఅభిషేక్ శర్మ.. ఐసీసీ నెం. 1 ర్యాంకుతో పాటు మరో అవార్డు

అభిషేక్ శర్మ.. ఐసీసీ నెం. 1 ర్యాంకుతో పాటు మరో అవార్డు

abhishek-sharma-icc-player-of-the-month-asia-cup-hero-3102bc

న్యూస్ డెస్క్: టీమిండియా యువ సంచలనం అభిషేక్ శర్మ ఖాతాలో అరుదైన ఘనత చేరింది. సెప్టెంబర్ నెలకు గానూ ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్’ అవార్డును ఆయన కైవసం చేసుకున్నారు. ఈ గుర్తింపుతో పాటు, ప్రస్తుతం ఐసీసీ పురుషుల టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న అభిషేక్, 931 రేటింగ్ పాయింట్లతో డేవిడ్ మలన్ రికార్డును కూడా బద్దలు కొట్టారు.

ఈ అవార్డు గెలుచుకోవడంపై అభిషేక్ శర్మ సంతోషం వ్యక్తం చేశారు. “జట్టు విజయాల్లో పాలుపంచుకున్నందుకు ఈ గుర్తింపు రావడం గర్వంగా ఉంది. కఠిన పరిస్థితుల నుంచి కూడా విజయాలు సాధించగల సత్తా ఉన్న జట్టులో నేను భాగస్వామిని కావడం అదృష్టం” అని ఐసీసీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

తనకు స్వేచ్ఛగా ఆడే అవకాశం కల్పించిన టీమ్ మేనేజ్‌మెంట్‌కు, మద్దతుగా నిలిచిన సహచరులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ రేసులో అభిషేక్‌తో పాటు అతని సహచరుడు కుల్దీప్ యాదవ్, జింబాబ్వే ఆటగాడు బ్రియాన్ బెన్నెట్ పోటీపడ్డారు.

ఇటీవల ముగిసిన ఆసియా కప్ 2025 టోర్నమెంట్లో అభిషేక్ శర్మ కనబరిచిన అద్భుతమైన ప్రదర్శనకు ఈ పురస్కారం దక్కింది. ఆ టోర్నీలో కేవలం 7 మ్యాచ్‌లలోనే ఏకంగా 200 స్ట్రైక్ రేట్‌తో 314 పరుగులు చేసి, అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.

ముఖ్యంగా పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌తో సహా పలు కీలక సమయాల్లో అద్భుతంగా రాణించి భారత్ కప్ గెలవడంలో అభిషేక్ కీలక పాత్ర పోషించాడు. ఈ నెల 29 నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌లో బరిలోకి దిగనున్న అభిషేక్, ఇదే ఫామ్ కొనసాగించి జట్టులో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలని భావిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular