Friday, April 17, 2026
HomeTelanganaసిద్దరామయ్య దిగితే.. రేవంత్ కు ముప్పేనా?

సిద్దరామయ్య దిగితే.. రేవంత్ కు ముప్పేనా?

siddaramaiah-resignation-effect-on-revanth-reddy-analysis

న్యూస్ డెస్క్: దక్షిణాదిలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న రెండు ప్రధాన రాష్ట్రాలు కర్ణాటక, తెలంగాణ. ఇప్పుడు కర్ణాటకలో సీఎం మార్పు జరిగితే, ఆ ఎఫెక్ట్ కచ్చితంగా తెలంగాణపై పడుతుందని పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ సాగుతోంది.

అక్కడ సిద్దరామయ్య, డీకే శివకుమార్ మధ్య పదవీ కాలం పంపకాల ఒప్పందం ఉందనే ప్రచారం ఉంది. ఒకవేళ సిద్దరామయ్య దిగిపోతే, తెలంగాణలో కూడా అసమ్మతి నేతలు గళం విప్పే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇక్కడ కూడా సీఎం రేసులో ఉన్న సీనియర్లు చాలా మందే ఉన్నారు.

రేవంత్ రెడ్డికి డీకే శివకుమార్ లాగా సొంత క్యాడర్ కానీ, బలమైన వర్గం కానీ లేకపోవడం పెద్ద మైనస్. ప్రస్తుతం ఆయన అధికారంలో ఉన్నారు కాబట్టి అందరూ చుట్టూ ఉన్నారు, కానీ తేడా వస్తే సపోర్ట్ చేసేవాళ్ళు కరువవుతారనే టాక్ వినిపిస్తోంది.

దీనికి తోడు రెండేళ్ళ పాలనపై జనాల్లో వ్యతిరేకత ఉందన్న సర్వే రిపోర్టులు కలవరపెడుతున్నాయి. అటు సిటీలో కొత్త ప్రాజెక్టులు లేక, ఇటు పల్లెల్లో సరైన పర్యటనలు లేక అర్బన్, రూరల్ ఓటర్లు ఇద్దరూ రేవంత్ సర్కార్ పై అసంతృప్తితో ఉన్నారట.

మరోవైపు రేవంత్ రెడ్డి ప్రధాని మోదీతో సన్నిహితంగా ఉండటం హైకమాండ్ కు అస్సలు నచ్చడం లేదని సమాచారం. ఇండియా కూటమిలోని ఇతర సీఎంలు మోదీకి దూరంగా ఉంటుంటే, రేవంత్ మాత్రం ‘బడా భాయ్’ అంటూ తరచూ కలవడం ఢిల్లీ పెద్దలకు ఆగ్రహం తెప్పిస్తోంది.

సిద్దరామయ్య అసలు మోదీ ఛాయలకే వెళ్లరు, కానీ రేవంత్ తీరు మాత్రం భిన్నంగా ఉంది. మొత్తానికి బెంగళూరులో అధికార మార్పిడి జరిగితే, ఆ సెగ హైదరాబాద్ వరకు వచ్చి రేవంత్ కుర్చీకి ఎసరు పెట్టినా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular