
జూబ్లీహిల్స్: ఉప ఎన్నిక ఓటమిని బీఆర్ఎస్ ‘స్వయంకృతాపరాధం’గా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. సానుభూతితో గెలవాల్సిన సిట్టింగ్ సీటును, అనవసరంగా సీఎం రేవంత్ రెడ్డిని కెలికి చేజేతులా పోగొట్టుకున్నారనే కామెంట్స్ వస్తున్నాయి. ఈ ఎన్నిక రేవంత్ ప్రభుత్వానికి ‘రెఫరెండం’ అని, ఆయన సీఎం పీఠం నుంచి దిగిపోతారని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేయడమే బెడిసికొట్టింది.
ఈ సవాలును రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా తీసుకున్నారు. ఒక సీఎం వారం రోజుల పాటు గల్లీగల్లీ తిరుగుతూ, ప్రభుత్వ యంత్రాంగాన్ని, మిత్రపక్షాలను సమర్థంగా వాడుకుని తన ‘పవర్’ ఏంటో చూపించారు. బీఆర్ఎస్ నేతలు తమ అభ్యర్థి సునీతతో కాకుండా, నేరుగా రేవంత్ రెడ్డితోనే పోటీ పడుతున్నట్లు వాతావరణం సృష్టించారు.
2023లో అధికారం కోల్పోయినా, రేవంత్‌ను సీఎంగా జీర్ణించుకోలేకపోవడమే బీఆర్ఎస్ దూకుడుకు కారణమని, ఇదే వారిని దెబ్బతీస్తోందని అంటున్నారు.
ఈ తాజా ఓటమితో బీఆర్ఎస్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. 2023 తర్వాత ఒక్క విజయం లేని ఆ పార్టీ, ఇప్పుడు సొంత సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడంతో, జీహెచ్ఎంసీ, స్థానిక ఎన్నికలకు ముందే కేడర్ నైరాశ్యంలోకి జారుకునే ప్రమాదం ఉంది.
రేవంత్‌ను ఎమ్మెల్యేగా అరెస్ట్ చేసినప్పటి నుంచి, ఆయన ఎదుగుదలకు బీఆర్ఎస్ దూకుడే కారణమవుతోందని, ఇప్పుడు అదే రిపీట్ అయిందని విశ్లేషకులు అంటున్నారు.
