
న్యూస్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో ‘కేకే సర్వే’కు (కిరణ్ కొండేటి) మంచి పేరుంది. ముఖ్యంగా 2019, 2024 ఏపీ ఎన్నికల ఫలితాలను దాదాపు కచ్చితత్వంతో అంచనా వేసి, సీట్ల సంఖ్యతో సహా చెప్పి సంచలనం సృష్టించారు. దీంతో ఈ సర్వే సంస్థకు అపారమైన విశ్వసనీయత లభించింది.
అయితే, తాజాగా వెలువడిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం, కేకే సర్వే అంచనాలను తలకిందులు చేసింది. ఈ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలుస్తుందని కేకే సర్వే బల్లగుద్ది చెప్పింది.
ప్రీ-పోల్ సర్వేలో బీఆర్ఎస్‌కు 55.2% ఓట్లు, ఎగ్జిట్ పోల్‌లో 49% ఓట్లు వస్తాయని, కాంగ్రెస్ రెండో స్థానానికి పరిమితమవుతుందని అంచనా వేసింది. కానీ, అసలు ఫలితం ఇందుకు పూర్తి రివర్స్‌లో వచ్చింది.
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీఆర్ఎస్‌పై భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ ఫలితం కేకే సర్వే అంచనాకు, వాస్తవానికి మధ్య ఎంత తేడా ఉందో చూపించింది. జూబ్లీహిల్స్ ఓటర్ల నాడిని పట్టుకోవడంలో ఈ సంస్థ పూర్తిగా విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి.
గతంలో హర్యానా ఎన్నికల్లోనూ బీజేపీ ఓడిపోతుందని చెప్పగా, ఫలితం రివర్స్ అయింది. ఇప్పుడు జూబ్లీహిల్స్‌లోనూ అదే పునరావృతం కావడంతో, కేకే సర్వే తన క్రెడిబిలిటీని కోల్పోతోందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది.
