
న్యూస్ డెస్క్: టెక్ దిగ్గజం యాపిల్ విడుదల చేసిన కొత్త ఐప్యాడ్ ప్రొ మోడళ్ల విక్రయాలు ఈ నెల 22 నుంచి భారత మార్కెట్‌లో ప్రారంభం కానున్నాయి. వినియోగదారులు ఆపిల్ ఆన్‌లైన్ స్టోర్‌తో పాటు ఆథరైజ్డ్ స్టోర్స్‌లో వీటిని కొనుగోలు చేయవచ్చు. ఐప్యాడ్ ప్రొ 11 ఇంచుల వైఫై మోడల్ ప్రారంభ ధర రూ. 99,900 ఉండగా, 13 ఇంచుల మోడల్ ప్రారంభ ధర రూ. 1,29,900గా ఉంది.
అద్భుతమైన విజువల్స్ కోసం ఈ ఐప్యాడ్‌లలో ఓఎల్ఈడీ డిస్‌ప్లే టెక్నాలజీని అమర్చారు. ఇది 1600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల సూర్యకాంతిలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. మెరుగైన ఆడియో అనుభూతి కోసం ఇందులో క్వాడ్ స్పీకర్లు, మైక్రోఫోన్లు కూడా అమర్చారు.
ఈ కొత్త ఐప్యాడ్‌లు 11 అంగుళాలు, 13 అంగుళాల స్క్రీన్ సైజుల్లో అందుబాటులో ఉన్నాయి. వీటిని 12 జీబీ, 16 జీబీ ర్యామ్ ఆప్షన్లతో పాటు 256 జీబీ నుంచి ఏకంగా 2 టీబీ వరకు స్టోరేజ్ సామర్థ్యంతో పలు వేరియంట్లలో అందిస్తున్నారు. ఈ పరికరాలలో ముందు, వెనుక 12 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి.
ఈ ఐప్యాడ్‌లు సుమారు 10 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తాయని కంపెనీ పేర్కొంది. ప్రత్యేకంగా కొనుగోలు చేయాల్సిన హై-వాటేజ్ అడాప్టర్‌తో కేవలం 30 నిమిషాల్లో 50 శాతం వరకు చార్జ్ చేయవచ్చని యాపిల్ తెలిపింది. ఇందులో వైఫై 6ఇ, బ్లూటూత్ 5.3, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్, ఫేస్ ఐడీ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి.
ఈ కొత్త ఐప్యాడ్ మోడళ్లను టెక్నాలజీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనికి కారణం, ఈ ఐప్యాడ్‌లలో అత్యంత శక్తివంతమైన M5 చిప్‌సెట్‌ను ఉపయోగించడం. గతేడాది విడుదలైన మ్యాక్‌బుక్ ప్రో ల్యాప్‌టాప్‌లలో ఉపయోగించిన శక్తిమంతమైన ప్రాసెసర్‌నే ఇందులో అందించడం విశేషం. ఈ చిప్ పాత మోడళ్లతో పోలిస్తే 30 శాతం వేగవంతమైన పనితీరును అందిస్తుందని యాపిల్ వెల్లడించింది.
