Monday, March 16, 2026
HomeAndhra Pradeshవిశాఖ గూగుల్ హబ్: సుందర్ పిచాయ్ దెబ్బకు వైసీపీ వాదన బేజార్!

విశాఖ గూగుల్ హబ్: సుందర్ పిచాయ్ దెబ్బకు వైసీపీ వాదన బేజార్!

న్యూస్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటుపై రాజకీయ దుమారం రేగుతోంది. ఈ ప్రాజెక్టు ద్వారా 1.80 లక్షల ఉద్యోగాలు వస్తాయన్న ప్రభుత్వ ప్రకటనపై విపక్ష వైసీపీ సందేహాలు వ్యక్తం చేస్తుండగా, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తాజా వ్యాఖ్యలతో ఈ చర్చ కొత్త మలుపు తీసుకుంది. ఆయన ప్రకటనతో వైసీపీ వాదన బలహీనపడి, ప్రభుత్వానికి నైతిక బలం చేకూరినట్లు కనిపిస్తోంది.

అమెరికా వెలుపల గూగుల్ పెడుతున్న అతిపెద్ద పెట్టుబడి కావడంతో విశాఖ హబ్ వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే, గూగుల్ సంస్థకే ప్రపంచవ్యాప్తంగా లేనన్ని ఉద్యోగాలు ఒక్క విశాఖలో ఎలా వస్తాయంటూ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ వంటి వైసీపీ నేతలు లాజిక్ తీశారు. ఈ విమర్శల ద్వారా ప్రభుత్వ ప్రచారంలోని వాస్తవికతను ప్రశ్నించే ప్రయత్నం చేశారు.

ఈ రాజకీయ వాదోపవాదాల నడుమ, స్వయంగా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ రంగంలోకి దిగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. విశాఖను అందమైన నగరంగా అభివర్ణించిన ఆయన, ఈ ప్రాజెక్టు విషయంపై ప్రధానితో కూడా చర్చించినట్లు వెల్లడించారు. ఇది ప్రాజెక్టుపై ఉన్న అనుమానాలను పటాపంచలు చేయడమే కాకుండా, వైసీపీని ఇరకాటంలోకి నెట్టింది.

ప్రభుత్వం చెబుతున్న 1.80 లక్షల ఉద్యోగాల సంఖ్య కేవలం గూగుల్ ప్రత్యక్షంగా ఇచ్చేవి కావని, దాని రాకతో ఏర్పడే అనుబంధ పరిశ్రమలు, స్టార్టప్‌లు, పరోక్ష ఉపాధి అవకాశాలను కలిపితే ఆ సంఖ్య సాధ్యమేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు. సుందర్ పిచాయ్ మాటలు కూడా విశాఖ రూపురేఖలు మారతాయని పరోక్షంగా చెప్పినట్లే అయింది.

మొత్తంమీద, సుందర్ పిచాయ్ ప్రకటనతో గూగుల్ హబ్ అనేది కేవలం ప్రచారం కాదని, ఒక వాస్తవమని తేలిపోయింది. దీంతో, ఈ అంశంపై విమర్శలు చేస్తున్న వైసీపీ ఆత్మరక్షణలో పడగా, అధికార కూటమికి ప్రజల్లో మరింత సానుకూలత పెరిగింది. ఇకనైనా విమర్శలు పక్కనపెట్టి వాస్తవాలను గ్రహించాల్సిన అవసరం వైసీపీకి ఏర్పడింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular