
న్యూస్ డెస్క్: కేవలం 14 ఏళ్ల యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ వరుస సెంచరీలతో రికార్డులు సృష్టిస్తున్నాడు. తాజాగా అండర్-19 ఆసియా కప్‌లో ఈ బిహారీ బాబు ఆకాశమే హద్దుగా చెలరేగి, టీమిండియాను రికార్డుల శిఖరానికి చేర్చాడు.
దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్‌లో యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు వైభవ్ సూర్యవంశీ అదిరిపోయే ఆరంభం ఇచ్చాడు. కేవలం 95 బంతుల్లో 171 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో 14 సిక్సులు, 9 ఫోర్లు ఉండడం విశేషం.
సూర్యవంశీ విధ్వంసక ఇన్నింగ్స్ తో పాటు అరోన్ జార్జి (69), విహాన్ మల్హోత్రా (69), వేదాంత్ త్రివేది (38) కూడా రాణించడంతో, యువ టీమిండియా ఏకంగా 433 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీని ద్వారా 2004లో అండర్-19 భారత జట్టు నెలకొల్పిన 425 పరుగుల రికార్డును ప్రస్తుత జట్టు అధిగమించింది.
వచ్చే జనవరి 15 నుంచి జింబాబ్వేలో జరగబోయే అండర్-19 ప్రపంచకప్‌లో సూర్యవంశీ చెలరేగడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుత కెప్టెన్ ఆయుష్ కంటే కూడా వైభవ్ మెరుగ్గా రాణిస్తున్న నేపథ్యంలో, అతడికి కెప్టెన్సీ వచ్చినా ఆశ్చర్యం లేదు.
వైభవ్ ఆడుతున్న తీరు చూస్తుంటే, అతడిని త్వరలోనే టీమిండియా సీనియర్ జట్టులోకి తీసుకోవాలని డిమాండ్లు వస్తున్నాయి. ఐసీసీ నిబంధనల ప్రకారం అంతర్జాతీయ క్రికెట్ ఆడాలంటే 15 ఏళ్లు నిండాలి. అతనికి మరో 105 రోజుల్లో 15 ఏళ్లు నిండుతాయి. సెలక్టర్లు ఇప్పటికే వైభవ్ పై ప్రత్యేక దృష్టి సారించారు.
